ఆ మంత్రి ఊస్టింగ్ – టీడీపీ సెల‌బ్రేష‌న్స్‌

ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న త‌ర్వాత అస‌మ్మ‌తి జ్వాల‌లు ఇంకా ఎగ‌సిప‌డుతూనే ఉన్నాయి. మంత్రి ప‌ద‌వి నుంచి ఉద్వాస‌న‌కు గురైన బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి బాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఇటు మంత్రి ప‌ద‌వి రాని వాళ్లు సైతం తీవ్ర అసంతృప్తితో భ‌గ్గుమంటున్నారు. ఈ అస‌మ్మ‌తి జ్వాల‌లు, అసంతృప్తి కుంప‌ట్లు ఇలా ఉంటే ఓ మంత్రి ప‌ద‌వి ప్ర‌క్షాళ‌న‌లో ఊస్ట్ అయినందుకు టీడీపీ నేత‌లు భ‌లే సంబ‌రాలు చేసుకుంటున్నారు.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి నుంచి రెండోసారి (ఫ‌స్ట్ టైం ఆచంట నుంచి) గెలిచిన పీత‌ల సుజాత గ‌త ఎన్నిక‌ల అనంత‌రం సామాజిక స‌మీక‌ర‌ణాల‌తో పాటు లేడీస్ కోటాలో మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. ఆమె మంత్రి అయిన‌ప్ప‌టి నుంచి మొన్న ప్ర‌క్షాళ‌న‌లో మంత్రి ప‌ద‌వి నుంచి ఊస్టింగ్ అయ్యేవ‌ర‌కు ఆమె మీద లెక్క‌లేన‌న్ని కాంట్ర‌వ‌ర్సీలు వ‌చ్చేశాయి.

మంత్రిగా జిల్లాలో పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులంద‌రిని స‌మ‌న్వ‌యం చేసుకుని వెళ్లాల్సిన ఆమె గ్రూపులు క‌ట్టార‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. జిల్లాలో ఏలూరు ఎంపీ మాగంటి బాబుతోను, విప్‌, దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌తోను ఆమె పొస‌గ‌లేదు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలోను సుజాత స‌ప‌రేట్ గ్రూప్ మెయింటైన్ చేయ‌డంతో పార్టీ నిట్ట‌నిలువునా చీలిపోయింది. జిల్లాలో అన్ని ఏఎంసీ చైర్మ‌న్ పోస్టులు భ‌ర్తీ అయినా మంత్రిగా ఉన్న సుజాత మాత్రం త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన చింత‌ల‌పూడి ఏఎంసీ పాల‌క‌వ‌ర్గాన్ని ఏర్పాటు చేయ‌లేదు.

పార్టీ ఆవిర్భావం నుంచి క‌ష్ట‌ప‌డిన వారికి కాకుండా పార్టీలు మారిన వారికి, జూనియ‌ర్ల‌ను, బ‌ల‌మైన కేడ‌ర్ లేకుండా త‌న భ‌జ‌న చేసేవాళ్ల‌నే సుజాత ఏఎంసీ చైర్మ‌న్ చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. చివ‌ర‌కు ప్ర‌భుత్వం ఏర్ప‌డి మూడేళ్ల‌యినా ఇంకా చింత‌ల‌పూడి ఏఎంసీ పాల‌క‌వ‌ర్గం భ‌ర్తీకాలేదు. ఇక ఆమె గెలుపుకోసం ఐక్యంగా క‌ష్ట‌ప‌డిన క్యాడర్‌ను ఆమె నిర్ల‌క్ష్యం చేశార‌న్న టాక్ ఉంది. ఓ మంత్రిగా నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిలో ఏమాత్రం త‌న‌దైన ముద్ర వేయ‌లేదు. దీంతో ఆమెను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌డంతో టీడీపీలోనే ఆమె యాంటీ గ్రూప్ నియోజ‌క‌వ‌ర్గంలో సెల‌బ్రేష‌న్స్ జోరుగా చేసుకుంటోంది.

సుజాత‌ను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీలో ఏక‌పోక‌డ‌లు పోయాయ‌ని వారంతా ఖుషీగా ఉన్నారు. ఇక సుజాత అవినీతి ప‌రంగాను అనేక‌సార్లు మీడియాలో నిలిచారు.గ్రానైట్ వ్యాపారుల నుంచి వ‌డ్డాణం తీసుకున్న‌ట్టు ఆరోప‌ణ‌లు, త‌న ఇంట్లోనే ల‌క్ష‌ల‌తో ఉన్న డ‌బ్బు సంచులు బ‌య‌ట ప‌డ‌డం, జిల్లాల్లో ఆమె ప‌ర్య‌ట‌న‌ల‌కు ఆమె శాఖ‌ల్లో ఉన్న ఉద్యోగుల నుంచి చందాలు వ‌సూలు, ఆమె తండ్రి, సోద‌రుడు ఏకంగా క్యాష్ కౌంట‌రే ఓపెన్ చేశార‌ని విప‌క్షాల విమ‌ర్శ‌లు ఇలా ఎన్నో కాంట్ర‌వ‌ర్సీల్లో చిక్కుకున్న పీత‌ల సుజాత‌కు చివ‌ర‌కు మంత్రి ప‌ద‌వి ఊస్ట్ అవ్వ‌క‌త‌ప్ప‌లేదు.