రామోజీతో కేసీఆర్ రాజీ… ఫిల్మ్‌సిటీ అక్కౌంట్‌లోకి వంద‌ల ఎక‌రాలు

తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణ‌యం ఒక‌టి అంద‌రినీ అవాక్క‌య్యేలా చేస్తోంది!! తెలంగాణ ఉద్య‌మ సమ‌యంలో ఏ నోటితో అయితే రామోజీని తిట్టిపోసి.. ఆయ‌న క‌ట్టుకున్న స్వ‌తంత్ర రాజ్యం ఫిల్మ్ సిటీని ల‌క్ష నాగ‌ళ్ల‌తో దున్నిస్తానన్న కేసీఆర్ ఇప్పుడు అదే రామోజీకి దాసోహం అయిపోయారా? అని తెలంగాణ జ‌నాలు చెవులు కొరుక్కుంటున్నారు. ప్ర‌స్తుతం రామోజీ ఫిలిం సిటీకి రంగారెడ్డి జిల్లాలోని అనాజ్‌పూర్ స‌హా చుట్టుప‌క్క‌ల సుమారు 375 ఎక‌రాల స్థ‌లాన్ని కారు చౌక‌గా క‌ట్ట‌బెడుతున్నారు.

ఇప్పుడు ఈ విష‌యం తెలంగాణ‌లో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి తెలంగాణ ఉద్య‌మం మంచి కాక‌మీదున్న స‌మ‌యంలో ఆంధ్రోళ్లు తెలంగాణోళ్ల‌ని దోచేస్తున్నరంటూ కేసీఆర్ నిజామాబాద్‌లో జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో పెద్ద ఎత్తున విరుచుకుప‌డ్డారు. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ ఆవిర్భావం అనంత‌రం రంగారెడ్డి జిల్లాలోని రామోజీ ఫిలింసిటీని ల‌క్ష నాగ‌ళ్ల‌తో దున్నిస్తాన‌ని, దానిని తెలంగాణ బిడ్డ‌ల‌కు పంచుతామ‌ని పెద్ద పెద్ద డైలాగులు వ‌ల్లించారు. అయితే, ఇప్పుడు అదే కేసీఆర్ సీఎం అయ్యారు. ఆయ‌న కొడుకు, కూతురు, మేన‌ల్లుడు అంద‌రూ ప‌ద‌వుల్లోనే ఉన్నారు.

అయితే, రామోజీ ఫిలిం సిటీ జోలికి మాత్రం వెళ్ల‌క‌పోగా.. ఏడాది కింద‌ట రామోజీ రావు ఇచ్చిన ఆతిథ్యాన్ని మంత్రులు ఈట‌ల రాజేంద్ర, త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్‌తో క‌లిసి స్వీక‌రించి, రామోజీ క‌ట్టుకుంటున్న ఓం సిటీని ప్ర‌తిపాద‌న‌ను చూసి మురిసిపోయి.. ఈ సంద‌ర్భంగా రామోజీని ఆకాశానికి ఎత్తేయ‌డ‌మేకాకుండా.. ఆయ‌న‌పై గ‌తంలో తాను అన్న‌మాట‌లు ఒట్టివేన‌ని చెప్పుకొచ్చారు. అప్ప‌ట్లో ఈ కామెంట్ల‌పై పెద్ద దుమారం కూడా రేగింది. ఇక‌, ఇప్పుడు.. అదే రామోజీ రావు కోసం తెలంగాణ బిడ్డ‌ల‌కు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సీఎంగా ఉన్న స‌మ‌యంలో ఇచ్చిన భూముల‌ను అతి త‌క్కువ ధ‌ర‌ల‌కు క‌ట్ట‌బెట్టేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు.

సో.. ఇప్పుడు కేసీఆర్ నిర్ణ‌యంపై అటు ఉద్య‌మ‌కారులు స‌హా సామాన్య జ‌నాల్లోనూ ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతోంది. ఏదేమైనా పెద్ద‌లు పెద్ద‌లు ఒక‌టే అనే నానుడిని కేసీఆర్ నిజం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అయితే, రామోజీని ఎదిరించే ధైర్యం ఏ ఒక్క‌రూ చేయ‌క‌పోవ‌డం ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం.