ముంద‌స్తుకు సై అన‌డం వెనుక వ్యూహమిదే

ఏపీలో ప‌రిస్థితులు ఇప్పుడిప్పుడే చ‌క్క‌బడుతున్నాయి. తెలంగాణ బంగారు తెలంగాణ‌గా మార్చేందుకు నాయ‌కులు అడుగులు వేస్తున్నారు. ఎన్నిక‌లకు రెండేళ్ల స‌మ‌యం ఉన్నా.. అప్పుడే మూడేళ్లు అయిపోయాయా అనే భావ‌న అంద‌రిలోనూ ఉంది. కానీ మ‌రోసారి ఎన్నిక‌ల‌కు తెలుగు రాష్ట్రాల సీఎంలు సై అంటున్నారు. అటు పార్టీ శ్రేణుల్లోనే కాక‌.. ప్ర‌జ‌ల్లోనూ ఇప్పుడు ముంద‌స్తు ఎన్నిక‌ల ఫీవ‌ర్ పెంచేశారు. ఎన్నిక‌ల హామీలు ఇంకా నెర‌వేర్చ‌లేదు.. మ్యానిఫెస్టోలో ఇచ్చిన‌వి.. ప్ర‌తిపాద‌న‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. కానీ ముంద‌స్తుకు ప్ర‌ధాని మోదీ.. ఓకే అన‌గానే ఇద్ద‌రు చంద్రులు సై అనడం వెనుక‌.. పెద్ద వ్యూహ‌లే ఉంద‌ట‌.

ముంద‌స్తు ఎన్నిక‌ల గురించి తెలియ‌గానే ఇద్ద‌రు చంద్రులూ.. బీజేపీ సీఎంల కంటే ముందుగానే ఎన్నిక‌ల‌కు ఊ అనేశారు. అక్కడ చెప్పడానికి ముందే ఇక్కడ దాదాపు అధికారికంగా ఎన్నికల జ్వరం తెచ్చేశారు. ప్ర‌భుత్వాలు భారం తగ్గించుకోవడానికి, ఎన్నికలు వచ్చేస్తున్నాయన్న భావన పెంచడానికి పాకులాడుతున్నాయి. దీనివ‌ల్ల‌ వారికి ఎన్నో ప్రయోజనాలున్నాయ‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. ఎన్నిక‌ల పేరు చెప్పి అన్ని అభివృద్ధి ప‌నుల‌ను వాయిదా వేయ‌వ‌చ్చు. పార్టీ వారికి ఇవ్వాల్సిన పదవులు వంటి వాటిని మరో దఫాకు నెట్టేయెచ్చు. ప్రజల్లోనూ ఎన్నికల కోసం ఏదో చేస్తారన్న ఆశలు రేకెత్తించవచ్చు. ప్రతిపక్షాలను గజిబిజిలో పడేయొచ్చు.

ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల మీద చ‌ర్చ జ‌రగ‌కుండా.. ఎన్నిక‌ల మీద‌కు చ‌ర్చ మ‌ళ్లించ‌వ‌చ్చు! ఈ విషయంలో మోదీ ప్రతిపాదన కన్నా ముందే ఇద్దరు ముఖ్యమంత్రులు స్పష్టమైన సంకేతాలివ్వడం వెనుక ఉద్దేశం కూడా ఇదే! ప్రతిపక్షాల ఉద్యమాలు ఆందోళనలపై నుంచి ఎన్నికల పోటీ నిధుల సమీకరణ, టికెట్ల కేటాయింపు వంటి అంశాలపైకి వెళితే తమ అంతర్గత వ్యవహారాలు సర్దుకుని అవతలి వారిపై ఫోక‌స్ పెట్టే అవ‌కాశముంది. ముప్పై ఏళ్లలో 1985,1994 మినహా తక్కిన అన్నిసార్లు తెలుగు నాట ఎన్నికలు లోక్‌సభతో పాటే జరిగాయి. 1989లో ఎన్టీఆర్‌, 2004లో చంద్రబాబు కూడా ముందే ముగించుకుని ముందస్తుకు వెళ్లడం ఓటమికే దారితీసింద‌ని గుర్తుచేస్తున్నారు.

ఐదేళ్ల‌కు జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లు ఇలా స‌గం కాలానికే రావ‌డం మాత్రం విపరీతమ‌ని చెబుతున్నారు. అజాగ్రత్తగా అధికారం పొగొట్టుకున్నామని తెలంగాణలో కాంగ్రెస్‌, ఏపీలో వైఎస్‌ఆర్ సీపీ మొదటి నుంచి బాధలో ఉన్నాయి. సో ముందస్తు వస్తే మంచిదనే అనుకుంటాయి మ‌రి.