అమెరికాలో చంద్ర‌బాబు స‌భ భారీ కాస్ట్లీ గురూ..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే అమెరికా పేరు జ‌పిస్తూ ఉంటారు. రాష్ట్రానికి పెట్టుబ‌డులు తీసుకు రావడంలో భాగంగా.. వివిధ దేశాలు తిరుగుతున్న ఆయ‌న‌.. ఇప్పుడు ఆ అమెరికాకే వెళ్ల‌బోతున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి.. అన్ని ఏర్పాట్లను ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైట్‌(ఏపీఎన్ఆర్‌టీ) ద‌గ్గ‌రుండీ మరీ చూస్తోంది. ఇందులో ఏర్పాటుచేసే స‌మావేశాల‌కు టికెట్‌ ఉచిత ప్ర‌వేశం అంటూనే.. భారీగా డ‌బ్బులు దండుకుంటోంది. రాజధాని కోసమో..లేక మరో అంశం కోసమే విరాళం ఇస్తే ఫ‌ర్లేదు కానీ.. ఇలా టిక్కెట్లు అమ్మి రాజధానికి.. లేదా మరే ఇతర అవసరానికి అయినా ఆ డబ్బులు వాడుకోవటం సరికాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీ సీఎం చంద్రబాబు మే నెలలో అమెరికా పర్యటనకు వెళుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు తన అమెరికా పర్యటనలో భాగంగా మే 6న టెక్సాస్ లో..7న క్యాలిఫోర్నియాలో పర్యటించనున్నారు. ఈ ప‌ర్య‌టన వెనక జరుగుతున్న తంతుపై రకరకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డల్లాస్ పట్టణంలో జరిగే ముఖ్యమంత్రి బహిరంగసభకి ఆహ్వానిస్తూ ఏపీఎన్ఆర్‌టీ సంస్థ తరపున సోషల్‌మీడియాలో ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు బహిరంగ సభకి హాజరవ్వాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల‌ని.. అప్పుడే అనుమతిస్తామని, కానీ ప్రవేశం ఉచితమని ఆ ప్రకటనల్లో ఉంది.

ఆ లింక్ మీద నొక్కి చూస్తే ఆ సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్కడినుండి ఈవెంట్‌బ్రైట్ అనే వెబ్‌సైట్‌లోకి వెళుతుంది.అక్కడ వెయ్యి డాలర్లు కడితే ముందు వరస సీట్లు కొనుక్కునే సౌకర్యం కూడా కల్పించారు ఏపీఎన్ఆర్‌టీ టీమ్. ఈ పర్యటన షో టిక్కెట్లు అమ్మేస్తున్నారు. ముందు వరసలో నలుగురు సభ్యులతో కూడిన ఫ్యామిలీ కూర్చోవాలంటే వెయ్యి డాలర్లు కట్టాలట. మన కరెన్సీ ప్రకారం సుమారు రూ.65 వేలు చెల్లించాలి. కాస్త వెనక సీట్లకు మరో రేటు క‌ట్టాల్సిందే! ఇక లంచ్ కు.. ప్రత్యేక సమావేశాలకు ఇలా రేట్లు పెట్టి టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు ఎన్ఆర్ఐలు చెబుతున్నారు.

ఒక‌ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు ఇలా టిక్కెట్లు విక్రయించటంపై అధికార వర్గాలువిస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీని సింగపూర్ చేస్తా, బిల్‌గేట్స్ నా వల్లే హైదరాబాదుకి వచ్చాడు, సత్య నాదెళ్ల‌ని నేనే ప్రోత్సహించా అని రోజూ చెప్పుకునే చంద్రబాబు.. అమెరికా పర్యటనలో సాగుతున్న తంతు చూసి తెలుగు వాళ్లు కూడా అవాక్కవుతున్నారు. విశాఖలో జరిగిన భాగస్వామి సదస్సులో బోగస్ ఒప్పందాల తరహాలోనే అక్కడ ఐటి కంపెనీల ఎంవోయుల కూడా ఇదే దందా సాగుతోంది. ముందు ఒప్పందాలు చేసుకోండి..తర్వాత పెట్టుబడుల సంగతి చూద్దాం అంటూ కొంత మంది ఎన్ఆర్‌టీ ..చంద్రబాబు అనుకూల టీమ్ లు పనిచేస్తున్నాయి.