త‌మిళ తెరపై కాషాయ సినిమా మొద‌లైందా..?

త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను తెర వెనుక నుంచి న‌డ‌పాల‌ని ఎప్ప‌టినుంచో వ్యూహాలు ర‌చిస్తున్న బీజేపీ.. ఎట్ట‌కేలకు విజ‌యం సాధించింది. న‌యానో భ‌యానో చివ‌రికి ప‌రిస్థితుల‌ను త‌న చెప్పుచేతల్లోకి తెచ్చుకుని స‌క్సెస్ అయింది. త‌న మార్క్ వ్యూహంతో కేంద్రం ప‌క్కాగా.. శ‌శిక‌ళ వ‌ర్గాన్ని త‌మిళ రాజ‌కీయాల నుంచి సైడ్ అయిపోయేలా చేసింది. ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక వాయిదా వేయ‌డం మొద‌లుకుని.. సీఎం ప‌ళ‌నిస్వామి నేరుగా మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వంతో క‌లిసేలా చేసి త‌మిళ రాజ‌కీయాల‌ను శాసించే స్థాయికి చేరుకుంది. ఇక రేపో మాపో ప‌న్నీర్ సెల్వాన్ని సీఎంని చేసినా.. ఆశ్చర్య‌పోన‌వ‌స‌రం లేదంటే కేంద్రం ఎంత‌లా చ‌క్రం తిప్పిందో అర్థం చేసుకోవ‌చ్చు!

త‌మిళనాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌లలిత మ‌ర‌ణానంత‌రం.. ఆ రాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసించాల‌ని బీజేపీ ఎన్నో ఎత్తులు వేసింది. ప‌న్నీర్ సెల్వాన్ని ముందుపెట్టి పోరాటం చేయించింది. శ‌శిక‌ళను సీఎం పీఠం ఎక్కకుండా.. వెంట‌నే ఆమెపై ఉన్న కేసును తెర‌పైకి తెచ్చి.. తాత్సారం చేసింది. త‌ర్వాత ఆమె అనుచ‌రుడైన ప‌ళ‌నిస్వామి సీఎం అయినా.. తర్వాత క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డింది. ఇక ధ‌న ప్ర‌వాహం పేరుతో ఆర్ కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లను వాయిదా వేయించింది. ఇలా అందివచ్చిన అవ‌కాశాల‌న్నింటినీ ఉప‌యోగించుకుని త‌మిళ‌నాడులో పాగా వేసింది.

అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ, దినకరన్ హఠాత్ సస్పెన్షన్ వెనుక భారతీయ జనతా పార్టీ మంత్రాంగం ఉందనేది దాచేస్తే దాగే అంశం కాదు. బీజేపీ భరోసా ఇవ్వనిదే పళనిసామి అంత ధైర్యం చేయగలిగే వాడే కాదనేది ప్రత్యేకంగా వివరించాల్సిన అంశం కాదు. ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో దినకరన్ గెలిచే పరిస్థితి కనిపించడంతో.. బీజేపీ అలర్ట్ అయ్యింది. దినకరన్‌కు చెక్ చెప్పేందుకు కేంద్రం తన చేతుల్లోని వ్యవస్థలతో ఆట మొదలుపెట్టింది. ధన ప్రవాహం అంటూ అక్కడ ఉపఎన్నికకు బ్రేక్ వేసింది. ఆర్కేనగర్ పంపకాలతో, ఈసీకి లంచం ఇవ్వజూపడంలో ఇరుక్కుపోయిన దినకరన్ ఇప్పుడు కదిలే మెదిలే పరిస్థితిలో లేడు. దీంతో ఒకే దెబ్బకు అటు శశిని, ఇటు దినకరన్ సాగనంపారు.

ఆది నుంచి పన్నీరుసెల్వం బీజేపీ అధినాయకత్వానికి టచ్ లోనే ఉన్నారు. మరోవైపు పళనితో చ‌ర్చ‌లు ప్రారంభించింది. `మాతో చేతులు కలిపితే పర్వాలేదు. లేకపోతే ఆర్కేనగర్ పంపకాలకు సంబంధించిన జాబితాలో నీ పేరు కూడా ఉందనే విషయాన్ని గుర్తు చేయాల్సి ఉంటుంద`న్న బెదిరించింది. సీఎం టక్కున దారిలోకి వచ్చాడు. అక్కడ నుంచి కథ కమలం కనుసన్నల్లో నడుస్తూ వస్తోంది. ఈ కథనంతా వెనకుండి నడిపించిన కమలం పార్టీ ఇప్పుడు డైరెక్టుగా రంగంలోకి దిగి అన్నాడీఎంకేను శాసించడం మొదలుపెట్టింది.