బీజేపీని తొక్కేసేందుకు బాబు కొత్త వ్యూహం!

ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా ఉన్నా.. వాటిని త‌న‌కు అనుకూలంగా మార్చుకునే నేత‌ల్లో ఏపీ సీఎం చంద్ర‌బాబు ముందు వ‌రుస‌లో ఉంటారు. టీడీపీ-బీజేపీ కూటమి విష‌యంలో చంద్ర‌బాబు వేస్తున్న అడుగులు చూస్తే.. ఇది నిజ‌మ‌నిపించ‌క మాన‌దు! బీజేపీకి టీడీపీతో ఉన్న అవ‌స‌రం కంటే.. టీడీపీకి-బీజేపీతో ఉన్న అవ‌స‌ర‌మే ఎక్కువ‌! కానీ చంద్ర‌బాబు మాత్రం బీజేపీ మాత్రం టీడీపీపై ఆధార‌ప‌డ‌క త‌ప్ప‌ని స‌రి అనేంత‌గా ప‌రిస్థితుల‌ను మార్చేస్తున్నారు! అందుకు ఇటీవ‌ల విడుద‌లైన ప‌ట్ట‌భ‌ద్రుల‌, ఉపాధ్యాయ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌నం! దీని వెనుక చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్ వేరే ఉంద‌ట‌.

బీజేపీని ఏపీలో ఎద‌గ‌నివ్వకూడ‌దు.. అదే స‌మ‌యంలో ఆ పార్టీతో బంధం తెగిపోకూడ‌దు.. ఇదీ ఇప్పుడు చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న వ్యూహం! రానురానూ బీజేపీ బ‌ల‌ప‌డుతోంది. ప్రాంతీయ పార్టీల బ‌ల‌హీన‌త‌ను కూడా కోరుకుంటోంది. రాష్ట్రాల వారీగా ల‌క్ష్యాలు పెట్టుకుని మ‌రీ అధికారం కైవ‌సం చేసుకుంటోంది. ఈ నేప‌థ్యంలో ఏపీలో తెలుగుదేశాన్ని కాపాడుకోవాలంటే… కేంద్రంతో పొత్తును మ‌రింత క‌ట్టుదిట్టం చేసుకోవాలి! అందుకే, ఈ మ‌ధ్య ఛాన్స్ దొరికితే చాలు.. భాజ‌పాతో పొత్తు రెండు పార్టీల‌కూ అత్యావ‌శ్య‌కం అనేట్టుగా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతున్నారు.

చెప్పాలంటే పాము చావ‌కూడ‌దు, క‌ర్ర విర‌గ కూడ‌దు అన్న‌ట్టుగా ఉంది! తాజా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాలపై విశ్లేష‌ణ‌లో కూడా చంద్ర‌బాబు ఇలాంటి అభిప్రాయాన్నే వ్య‌క్తం చేశార‌ట‌. ఉపాధ్యాయులు, ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌కవ‌ర్గాల్లో ఐదింట పోటీ చేస్తే… ఒక చోట మాత్ర‌మే బీజేపీ అభ్య‌ర్థి గెలిచారు. ఇత‌ర స్థానాల్లో టీడీపీ బ‌ల‌ప‌ర‌చినవారు ఓడిపోయారు. అయితే, ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు కొంతమంది భాజ‌పా నాయ‌కుల‌తో మాట్లాడుతూ… తెలుగుదేశం, భాజ‌పా క‌లిసి ప‌నిచేస్తే అన్ని ఎన్నిక‌ల్లోనూ త‌మ కూట‌మికే విజ‌యం ద‌క్కుతుంద‌ని అన్నారట‌. భ‌విష్య‌త్తులో కూడా ఇదే త‌ర‌హా ఐక‌మ‌త్యంతో ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నార‌ట‌!

రాబోయే విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కూడా ఇలానే క‌లిసి గెలుద్దామ‌ని కూడా చెప్పార‌ట‌! మొత్తానికి, తెలుగుదేశం పార్టీతో క‌లిసి ప‌నిచేయాల్సిన అవ‌స‌రం భాజ‌పాకి ఉంద‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  దీని వెనుక చంద్ర‌బాబు వ్యూహం వేరే ఉంద‌ట‌. అదేంటంటే.. ఎమ్మెల్సీ విజ‌యంతో బీజేపీ పూర్తిగా త‌న చెప్పు చేత‌ల్లోంచి జారిపోయే ప్ర‌మాదం ఉంది. అందుకే అడ్డుక‌ట్ట వేసేందు బాబు ఇప్ప‌టినుంచే ఇలా చేస్తున్నారు. ఏపీలో భాజ‌పా స్వ‌తంత్రంగా ఎదిగేందుకు కావాల్సిన ఏ చిన్ని అవ‌కాశాన్ని ఇవ్వ‌కుండా క‌ట్ట‌డి చేస్తున్నారు!