తమిళనాడులో ప్ర‌కంప‌న‌లు రేపుతున్న రజని పొలిటికల్ ఎంట్రీ

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో వస్తారా ? ఎన్నో యేళ్లుగా న‌లుగుతోన్న ఈ అంశం మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. త‌మిళ‌నాడులో కోట్ల‌లో ఉన్న ర‌జ‌నీ అభిమానులు త‌మ అభిమాన హీరో రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఎన్నో యేళ్లుగా కోరుతున్నారు. అయితే ర‌జ‌నీ మాత్రం ఈ విష‌యంలో సైలెంట్‌గా ఉంటున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా రజనీ రాజకీయాల్లో వస్తారంటూ ప్రచారం జరుగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో అప్పుడు బీజేపీ ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా ఉన్న న‌రేంద్ర‌మోడీ ర‌జ‌నీ ఇంటికి వెళ్లి మ‌రీ క‌లిశారు. అప్పుడే ర‌జ‌నీ బీజేపీలో చేర‌తారంటూ ప్ర‌చారం జ‌రిగింది.

ఆ త‌ర్వాత గ‌తేడాది త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల టైంలో కూడా ర‌జ‌నీ బీజేపీలో చేర‌తార‌ని… అమిత్‌షాకు ఆయ‌న‌కు మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని… ర‌జ‌నీ బీజేపీ త‌ర‌పున సీఎం అభ్య‌ర్థి రేసులో ఉంటార‌ని మ‌రోసారి వార్త‌లు వ‌చ్చాయి. అప్పుడు కూడా ర‌జ‌నీ సైలెంట్‌గా ఉన్నారు. ఇక తాజాగా దివంగ‌త మాజీ సీఎం జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్‌ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న గంగై అమరన్.. రజనీకాంత్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ త‌మిళ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది.

గంగై అమ‌ర‌న్ ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజాకు సోద‌రుడు. ఆయ‌న ఎన్నో సినిమాల‌కు సంగీతం అందించ‌డంతో పాటు స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా కూడా ప‌నిచేశారు. ఇప్పుడు వీరిద్ద‌రి భేటీతో ర‌జ‌నీ త్వ‌ర‌లోనే బీజేపీలో చేర‌తార‌ని ఊహాగానాలు జోరందుకున్నాయి. తాజా ఉప ఎన్నిక‌ల్లో ర‌జ‌నీ బీజేపీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక గ‌తంలో కూడా ర‌జ‌నీ సొంతంగా పార్టీ పెడ‌తార‌ని వార్త‌లు వ‌చ్చినా అవి కార్య‌రూపం దాల్చ‌లేదు. ఇక బీజేపీలో చేరితే ర‌జ‌నీకి ప్ర‌స్తుతం వెంట‌నే రాజ్య‌స‌భ ఇచ్చి కేంద్రంలో కేబినెట్ మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని మోడీ ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. ఇక వ‌చ్చే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల టైంకు ర‌జ‌నీ త‌మిళ‌నాడులో బీజేపీని బలోపేతం చేయాల్సి ఉంటుంది. అప్పుడు బీజేపీ నుంచి త‌మిళ‌నాడు సీఎం అభ్య‌ర్థిగా మీరే ఉంటార‌ని మోడీ ర‌జ‌నీకి చెప్పిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి సూప‌ర్‌స్టార్ పొలిటిక‌ల్ ఎంట్రీపై ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటారో చూడాలి.