త‌మిళ‌నాట షాక్‌:  దీప ఓ పార్టీ, దీప భ‌ర్త మ‌రో పార్టీ

త‌మిళ‌నాట మ‌రో సంచ‌ల‌నం! దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత స‌మాధి.. ఎన్నో ఆస‌క్తిక‌ర అంశాల‌కు వేదిక‌గా నిలుస్తోంది. ఊహించ‌ని ప‌రిణామాల‌తో రోజుకో మలుపు తిరుగుతున్న త‌మిళ రాజ‌కీయాల్లో స‌రికొత్త ట్విస్ట్‌! అమ్మ వార‌సురాలిగా తెర‌పైకి వ‌చ్చిన ఆమె మేన‌కోడ‌లు దీపకు అనుకోని వ్య‌క్తి నుంచి అనూహ్యంగా షాక్ ఎదురైంది.

దీప ఇంట్లోనే రెండు పార్టీలు ఏర్ప‌డ‌బోతున్నాయి. ఇప్ప‌టికే దీప ఒక పార్టీని ఏర్పాటుచేయ‌గా.. ఇప్పుడు ఆమె భ‌ర్త కూడా సొంతంగా ఒక పార్టీని స్థాపించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించి క‌ల‌క‌లం సృష్టించారు. అంతేగాక దీప వ‌ర్గంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో దీప వ‌ర్గంలో అల‌జ‌డి మొద‌లైంది.

ఆర్కే న‌గ‌ర్ నుంచి పోటీ చేయ‌బోతున్న దీప‌కు ఎదురెదెబ్బ త‌గిలింది. జయలలిత రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న ఆమె మేనకోడలు దీపకు ఆమె భర్త మాధవన్ ఊహించని షాకిచ్చాడు. జయ మరణం అనంతరం దీపా `ఎంజీఆర్ అమ్మ దీప పెరవై` అనే ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ విషయంలో దీప భర్త మాధవన్ ఆమెతో విభేదించారు. ఇక ఆ పొలిటికల్ ఫోరమ్‌లో కొనసాగనని స్పష్టం చేశాడు. శుక్రవారం జయలలిత సమాధి వద్దకు వెళ్లి మాధవన్ శ్రద్ధాంజలి ఘటించాడు. అనంతరం తానో కొత్త పార్టీ నెలకొల్పబోతున్నట్లు ప్రకటించాడు.

దీపను కొన్ని దుష్ట శక్తులు ప్రభావితం చేస్తున్నాయని, వారి విధానాలు నచ్చకే తాను దీప రాజకీయ వేదిక నుంచి వైదొలుగుతున్నట్లు మాధవన్ తెలిపాడు. అయితే ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు దీప ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇలా భర్త నుంచే ఎదురు దెబ్బ తగలడంతో దీప డైలమాలో పడ్డారు. ఫిబ్రవరి 24న ఆమె ఈ పొలిటికల్ ఫోరంను ఏర్పాటు చేశారు. అనంతరం జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో ఆమె పన్నీరుకు మద్దతు తెలిపారు. కానీ ప్రస్తుతం ఆమె పన్నీర్ సెల్వం వర్గానికి దూరంగా ఉన్నారు.

అన్నాడీఎంకే పార్టీ వ్యవహారాలన్నీ శశికళ వర్గం చెప్పుచేతల్లో ఉండటంతో దీప పార్టీని ఎలాగైనా చేజిక్కించుకోవాలని, ఆర్కే నగర్ నుంచి పోటీ చేసి గెలిచి జయకు నిజమైన రాజకీయ వారసురాలిని నిరూపించుకోవాలని భావిస్తున్నారు. ఇటువంటి స‌మ‌యంలో ఇంటి నుంచే ఇలా ఆమెకు ఊహించ‌ని షాక్ ఎదుర‌వ‌డం మింగుడుప‌డ‌ని అంశ‌మే!