టీఆర్ఎస్ ఓట‌మి ఇంటి దొంగ‌ల ప‌నేనా?

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న టీఆర్ఎస్ జైత్ర‌యాత్ర‌కు బ్రేక్ ప‌డింది. అది కూడా పార్టీకి బాగా ప‌ట్టున్న ఉత్త‌ర తెలంగాణ‌లో ఓట‌మి చ‌విచూసింది. ఇక త‌మ‌కు ఎదురు లేద‌నుకున్న గులాబీ దండుకు షాక్ త‌గిలింది. ఇప్ప‌టివ‌ర‌కూ గెలుపు గ‌ర్వంతో పైకెగిరిసిన టీఆర్ఎస్ నేత‌లు.. ఒక్క‌సారిగా పాతాళానికి ప‌డిపోయారు. ఊహించ‌ని ఈ ప‌రిణామంతో ఒక్క‌సారిగా టీఆర్ఎస్‌లో గుబులు మొద‌లైంది. వెంట‌నే పార్టీ హైక‌మాండ్ రంగంలోకి దిగింది. పోస్టుమార్టం చ‌ర్య‌లు ప్రారంభించింది.

ఉత్త‌ర తెలంగాణ‌లో అంతా టీఆర్ఎస్ మ‌యం! వ‌రంగ‌ల్ నుంచి ఆదిలాబాద్ వ‌ర‌కూ గులాబీ ద‌ళం ప‌టిష్టంగా ఉంది. ఇందులో వ‌రంగ‌ల్ జిల్లాలో మ‌రింత ప‌ట్టు ఉంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఊహ‌ల్లో తేలుతున్న నేత‌ల‌కు.. గ‌ట్టి షాక్ ఎదురైంది. వ‌రంగల్ జిల్లా భీమ‌దేవ‌ర ప‌ల్లి ముల్క‌నూరు స‌హాకార బ్యాంకు ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ నేత‌లకు ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలింది. ఇందులో ప్ర‌స్తుత అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే ప్ర‌వీణ్ రెడ్డి ప్యానెల్ నుంచి ఐదుగురు పోటీ ప‌డ్డారు. ఇక టీఆర్ఎస్ అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు.

ఇక పోటీ అంతా ఏకప‌క్ష‌మే అనుకున్న స‌మ‌యంలో.. టీఆర్ఎస్ అభ్య‌ర్థులు చిత్తుగా ఓడిపోయారు. ప్ర‌వీణ్ రెడ్డి ప్యానెల్‌ అభ్య‌ర్థుల‌కు 2,097ఓట్లు పోల‌య్యాయి. అలాగే ప్ర‌వీణ్ రెడ్డి మ‌ద్ద‌తు దారులకు 1650 ఓట్లు వ‌చ్చాయి. టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు కేవ‌లం 350 ఓట్లు మాత్ర‌మే ప‌డ‌టంతో ఒక్క‌సారిగా నాయ‌కులు అవాక్క‌య్యారు. దీంతో ప్ర‌వీణ్ రెడ్డి ప్యానెల్ ఘ‌న విజ‌యం సాధించింది. 80శాతం ఓట్లు ద‌క్కించుకోవ‌డం విశేషం! అయితే ఇప్ప‌టివ‌ర‌కూ బ‌లంగా ఉంద‌ని భావించిన టీఆర్ఎస్ హైక‌మాండ్‌.. ఈ ఓట‌మిని జీర్ణించుకోలేక‌పోతోంద‌ట‌.

పైకి బ‌లంగా ఉంద‌ని చెబుతున్నా.. అదంతా మేడి పండు చంద‌మేన‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వాపును చూసి బ‌లుపు అనుకున్నార‌ని అంతా చ‌ర్చించుకుంటున్నారు. న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల‌పై అధిష్టానం దృష్టిసారించింది. ఓట‌మిపై విశ్లేషించేందుకు వీలుగా నివేదిక స‌మ‌ర్పించాల‌ని పార్టీ అగ్ర నేత‌లు కోరార‌ట‌. దీంతో ఏం జ‌రుగుతందో అనే చ‌ర్చ మొద‌లైంది. కాగా ఇంటిదొంగ‌లే ఈ ఓట‌మికి కార‌ణ‌మ‌నే వ్యాఖ్య‌లు ఇప్పుడు బ‌లంగా వినిపిస్తున్నాయి.