చంద్ర‌బాబు ఎఫెక్ట్‌: ఏపీ మంత్రికి ఘోర అవ‌మానం

ఏపీ క్యాబ‌నెటిలో సీనియ‌ర్ మంత్రుల‌లో ఒక‌రైన రెవెన్యూ శాఖ శాఖ & డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తికి అటు పార్టీలోను, ఇటు ప్ర‌భుత్వంలోను ప‌దే ప‌దే అవ‌మానాలు ఎదుర‌వుతున్నాయి. కీల‌క‌మైన డిప్యూటీ సీఎంగాను, రెవెన్యూ శాఖ‌కు మంత్రిగా ఉన్న ఆయ‌న‌కు తెలియ‌కుండా ఆయ‌న శాఖ‌లో నిర్ణ‌యాలు వెలువ‌డిపోతున్నాయి. గ‌తంలో ఆయ‌న శాఖ‌లోని అధికారుల బ‌దిలీల‌కు సంబంధించి జారీ చేసిన ఉత్త‌ర్వులు కేవ‌లం కొద్ది గంట‌ల్లోనే క్యాన్సిల్ అయ్యాయి.

లోకేశ్ ఎంట్రీతో కేఈ ఉత్త‌ర్వులు ర‌ద్దు చేస్తూ కొత్త జీవోలు జారీ అయిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇక ఆయ‌న శాఖ‌ల‌ను, అధికారాల‌ను చంద్ర‌బాబు ఒక్కొక్క‌టిగా క‌ట్ చేసేస్తున్నారు. తాజాగా రెవెన్యూ శాఖ‌లో కీల‌క‌మైన డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లపై నేరుగా చంద్రబాబే పెత్తనం చలాయించేందుకు రంగం సిద్ధ‌మైంది.

ఈ కీల‌క పోస్టుల బ‌దిలీలు, నియామ‌కాల అధికారాన్ని రెవెన్యూ మంత్రి నుంచి త‌ప్పించి వాటిని సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌కు అప్ప‌గించేలా జీవో నెంబ‌ర్ 28 జారీ చేశారు. దీంతో కేఈ కృష్ణ‌మూర్తి మ‌రింత డ‌మ్మీ అయిపోయారన్న చ‌ర్చ‌లు మ‌రింత జోరుగా వినిపిస్తున్నాయి.

కేఈ.కృష్ణ‌మూర్తి రెవెన్యూ మంత్రిగా ఉన్నా కీల‌క‌మైన రాజ‌ధాని భూముల విష‌యంలో కూడా ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేశారు. త‌ర్వాత భూకేటాయింపుల విష‌యంలోను ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేశారు. ఇప్పుడు సొంత శాఖ‌లోను బ‌దిలీలు చేసే విష‌యంలోను కోత‌లు పెట్టేశారు. కేఈ ఓ మంత్రిగా స్టేట్‌కు ప్రాధినిత్యం వ‌హిస్తున్నారా ? లేదా ? ఓ ఎమ్మెల్యేగా త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమిత‌మైపోయారా ? అన్న డౌట్లు కూడా ఏపీ పాలిటిక్స్‌లో ట్రెండ్ అవుతున్నాయి.