కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌కు బాబు ముహూర్తం ఖ‌రారు … ప్ర‌కంప‌న‌లు రేప‌డం ఖాయం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ ప్ర‌క్షాళ‌న వార్త‌లు గ‌త యేడాదిన్న‌ర‌గా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎట్ట‌కేల‌కు త‌న కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌కు బాబు ముహూర్తం ఖ‌రారు చేశారు. ఉగాది, శాస‌న‌స‌భ, మండ‌లి స‌మావేశాలు ముగిశాక ఏప్రిల్ 6వ తేదీన కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని తెలుస్తోంది. ఈ ప్ర‌క్షాళ‌న‌లో ఐదుగురు మంత్రుల‌కు ఖచ్చితంగా ఊస్టింగ్ త‌ప్ప‌ద‌న్న టాక్ ఏపీ టీడీపీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ  అవుట్ లిస్టులో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన పీత‌ల సుజాత‌, విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన కిమిడి మృణాళిని, కృష్ణా జిల్లాకు చెందిన కొల్లు ర‌వీంద్ర‌, గుంటూరు జిల్లాకు చెందిన రావెల కిషోర్‌బాబుతోపాటు చిత్తూరు నుంచి బొజ్జ‌ల గోపాల కృష్ణారెడ్డి, అనంత‌పురం నుంచి ప‌ల్లె ర‌ఘునాథ్ రెడ్డి ఉన్నారు.

వీరిలో పీత‌ల‌, రావెల కిషోర్‌బాబుల‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు లెక్కేలేదు. వీరు వ‌రుస‌గా కాంట్ర‌వ‌ర్సీల్లో చిక్కుకున్నారు. వీరిద్ద‌రు ఔట్ లిస్టులో ఫ‌స్ట్ ప్లేసులో ఉన్నారు. ఇక కిమిడి మృణాళిని శాఖాప‌రంగా డిజాస్ట‌ర్ పెర్పామెన్స్ ఇచ్చారు. కొల్లు ర‌వీంద్ర ఎక్సైజ్ శాఖ పీక‌ల్లోతు అవినీతిలో కూరుకుపోయింది. అస‌లు ఆయ‌న మంత్రినో కాదు ఎవ్వ‌రికి తెలియ‌డం లేదు. ఇక బొజ్జ‌ల, ప‌ల్లెల‌లో ఒక‌రిని త‌ప్పించి వేరే రెడ్డి ఎమ్మెల్యేల‌తో ఈ పోస్టులు భ‌ర్తీ చేస్తార‌ని తెలుస్తోంది.

కేబినెట్‌లో సేఫ్ జాబితాలో ఉన్న వారిలో చిన రాజప్ప, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, సీహెచ్ అయ్యన్నపాత్రుడు, పరిటాల సునీత, కె. అచ్చన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు ఉన్నారు.

ఇక బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, పల్లె రఘునాధరెడ్డి, సిద్ధా రాఘవరావుల‌లో ఎవ‌రు ఉంటారో ..?  ఎవ‌రు అవుట్ అవుతారో కూడా బాబు తీసుకునే నిర్ణ‌యాన్ని బ‌ట్టి వీరి ఫ్యూచ‌ర్ ఆధార‌ప‌డి ఉంది. ఏదేమైనా కేబినెట్ ప్రక్షాళ‌న అయితే ప్ర‌కంప‌న‌లు రేప‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.