ఆ రిపోర్టులు కేసీఆర్ వ్యూహంలో భాగమేనా?

ఎమ్మెల్యేల‌పై నిఘా వ‌ర్గాల‌తో స‌ర్వే నిర్వ‌హించి.. మార్కులు కేటాయిస్తుంటారు ఏపీ సీఎం చంద్ర‌బాబు! ఎప్పటిక‌ప్పుడు ఇలా ప్రోగ్రెస్ కార్డులు రూపొందించి.. త‌క్కువ మార్కులు వ‌చ్చిన ఎమ్మెల్యేల‌కు బ్రెయిన్ వాష్ చేస్తుంటారు! ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రెస్ కార్డుల‌నే త‌యారుచేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌! దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు నిద్ర క‌రువు అవుతోంద‌ట‌.

ఇప్ప‌టికే రెండు సార్లు ఇటువంటి నివేదిక‌లు తెప్పించుకున్నారు! ముచ్చ‌టగా మూడోసారి కూడా రిపోర్ట్ త‌యారైంద‌ట‌! ఈ రిపోర్టుల్లో ఏముందోన‌నే టెన్ష‌న్ అందరిలోనూ పెరిగిపోయింద‌ట‌. టెన్ష‌న్ మాటెలా ఉన్నా..  ఇదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం ఎమ్మెల్యేలు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టేస్తున్నార‌ట‌.

తానేం చేసినా.. ఒక ప్ర‌త్యేక కార‌ణం ఉంటుంద‌ని కేసీఆర్ నిరూపించుకుంటున్నారు. త‌మ‌పై కేసీఆర్‌ రిపోర్టులు తెప్పించుకుంటున్నార‌ని తెలియ‌గానే ఎమ్మెల్యేలంతా యాక్టివ్ అయిపోయారు. ఇప్ప‌టికే రెండు సార్లు తెప్పించుకున్న నివేదిక‌ల్లో త‌క్కువ మార్కులు వ‌చ్చినా.. ఈ సారి మాత్రం ఎక్కువ మార్కులు సాధించాల‌ని ఆరాట‌ప‌డుతున్నారు. ఈ మార్కుల ఆధారంగానే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్లు కేటాయిస్తార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. దీంతో ఇప్పుడు అంతా త‌మ మార్కుల‌ను పెంచుకుని, కేసీఆర్ దృష్టిలో ప‌డేందుకు త‌పన‌పడుతున్నారు.

ఏప్రిల్ చివ‌రి వారంలో వ‌రంగ‌ల్‌లో టీఆర్ఎస్ భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించబోతోంది. ఇందులో రిపోర్ట్‌-3ను విడుద‌ల చేయ‌బోతున్నార‌నే వార్త ఇప్పుడు ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తేలా చేస్తోంది, ఆ రిపోర్టులో తాము ఏ స్థానంలో ఉన్నామో,  ఎన్ని మార్కులు వ‌చ్చాయోన‌ని తెగ కంగారు ప‌డుతున్నారు. ఇప్ప‌టికే కొంత‌మందికి రిపోర్ట్‌-1 కంటే రిపోర్ట్‌-2లో మార్కులు త‌క్కువ‌గా వ‌చ్చాయి. దీంతో ఎలాగైనా రిపోర్ట్‌-3లో మంచి మార్కులు కొట్టేయాల‌ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనే పాగా వేస్తున్నార‌ట‌.

ప్ర‌జ‌ల‌కు నిత్యం అందుబాటులోనే ఉంటూ.. వారి స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రిస్తున్నార‌ట‌. దీంతో ప్ర‌జ‌లు కూడా చాలా సంతోషం వ్య‌క్తంచేస్తున్నార‌ట‌. అయితే ఈ  రిపోర్టుల హ‌డావుడి అంతా ఎమ్మెల్యేల‌తో పనిచేయించ‌డానికేనా అని పార్టీ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి. దీని వ‌ల్ల న‌యానోభ‌యానో ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల‌కు చేరువ‌వుతార‌నేది కేసీఆర్ వ్యూహంలో భాగ‌మేన‌ని భావిస్తున్నాయి. మ‌రి ఏది ఏమ‌యినా రిపోర్టుల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు కొంత మంచి జ‌రుగుతోంద‌నేది వాస్త‌వం!!