కోదండ‌రాంను హీరోను చేసిన టీఆర్ఎస్‌

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌, సీఎం కేసీఆర్ వ‌ర్సెస్ టీజేఏసీ చైర్మ‌న్ కోదండరాం వార్ చినికి చినికి పెద్ద గాలివాన‌లా మారుతోంది. కోదండ‌రాం నిరుద్యోగుల కోసం చేప‌ట్టిన ర్యాలీలో ముంద‌స్తుగానే శాంతిభ‌ద్ర‌త‌ల పేరుతో ఆయ‌న్ను అరెస్టు చేసిన‌ట్టు ప్ర‌భుత్వం చెపుతున్నా వెన‌క చాలా రాజ‌కీయాలు ఉన్నాయ‌న్న విష‌యం తెలంగాణ‌లో చాలామందికి తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే కోదండ‌రాంపై తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేయ‌డం, కోదండ‌రాంను కులం పేరుతో విమ‌ర్శ‌లు చేయ‌డం, ముంద‌స్తుగా అరెస్టులు చేయ‌డం లాంటి విష‌యాల్లో టీఆర్ఎస్ సెల్ఫ్‌గోల్ చేసుకుందా ? అంటే అవుననే ఆన్స‌ర్ టీ రాజ‌కీయ మేథావులు వ్య‌క్తం చేస్తున్నారు. కోదండ‌రాం విష‌యంలో టీఆర్ఎస్ అత్యుత్సాహం ఆ పార్టీకే పెద్ద మైన‌స్‌గా మారింది.

ఇక టీఆర్ఎస్ నేత‌లు గ‌తంలో జేఏసీని ఏర్పాటు చేసింది కేసీఆరే అని..అయితే దానికి కోదండ‌రాం సాయ‌ప‌డ్డార‌ని ముందుగా అన్నారు. త‌ర్వాత రూటు మార్చి జేఏసీ నేత‌లు గ‌తంలో చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు హింసాత్మ‌క‌మ‌య్యాయ‌ని మ‌రో విమ‌ర్శ చేశారు. దీనిని బ‌ట్టి టీఆర్ఎస్ నాయ‌కులే జేఏసీ హింస‌లో కేసీఆర్ ఉన్నార‌ని వారు ఇన్‌డైరెక్టుగా ఒప్పుకున్న‌ట్ల‌య్యింది.

ఈ విష‌యంలో టీఆర్ఎస్ సెల్ఫ్‌గోల్ చేసుకున్న‌ట్ల‌య్యింది. ఇప్పుడు అంద‌రి వేళ్లు టీఆర్ఎస్‌, కేసీఆర్ వైపే ఉన్నాయి. మొత్తానికి కోదండ‌రాం అంటే టీఆర్ఎస్‌కు ఓ ఉలికిపాటు ఉంద‌న్న డౌట్లు ఇప్పుడు అంద‌రి మ‌దిలోనే వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇందుకు టీఆర్ఎస్ స‌ర్కార్ అతితొంద‌ర‌పాటే కార‌ణంగా కనిపిస్తోంది. ఇక కేసీఆర్ స‌ర్కార్ లోపాల‌ను కోదండ‌రాం ఎత్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలోనే కోదండ‌రాంకు తెలంగాణ వ్యాప్తంగా క్రేజ్ క‌నిపిస్తుండ‌డంతో ఆయ‌న్ను ప‌దే ప‌దే టార్గెట్ చేస్తూ కోదండ‌రాంను హీరోను చేసిన‌ట్టే తెలంగాణ‌లో ప్ర‌స్తుత ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

ఇక త‌నను టీఆర్ఎస్ స‌ర్కార్ పెడుతున్న ఇబ్బందుల‌ను రాజ‌కీయంగా ఎదుర్కోవాల‌ని డిసైడ్ అయిన ఆయ‌న తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా జూన్ 2వ తేదీన కొత్త పార్టీని కూడా ప్ర‌క‌టించేందుకు కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసుకుంటున్న‌ట్టు కూడా తెలుస్తోంది.