వైసీపీ అడ్రస్ మార్చవా జగన్..!

విభ‌జ‌న త‌ర్వాత ఏపీ ప‌రిపాల‌న అంతా న‌వ్యాంధ్ర నుంచే జ‌రుగుతోంది. అందుకు అనుగుణంగా రాజ‌కీయ పార్టీలు కూడా తమ పార్టీ కార్యాల‌యాల‌ను న‌వ్యాంధ్ర‌కు త‌ర‌లించాయి. అయితే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షమైన వైసీపీ మాత్రం హైద‌రాబాద్ నుంచే కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తోంది. అంతేగాక జ‌గ‌న్ హైద‌రాబాద్‌లోనే ఉండ‌టంతో ఆయ‌న్ను క‌లిసేందుకు నేత‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. పార్టీ విష‌యాలు అధినేత‌తో మాట్లాడాలంటే హైద‌రాబాద్ వ‌ర‌కూ రావాల్సి వ‌స్తోంద‌ని అసంతృప్తి వ్య‌క్తంచేస్తున్నారు. పార్టీ కార్యాల‌యాన్ని ఎప్పుడు న‌వ్యాంధ్ర‌కు త‌ర‌లిస్తారోన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు.

2019లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకుని సీఎం పీఠానెక్కాల‌న్న‌ లక్ష్యంతో ఉన్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి.. తన రాజకీయ కార్యకలాపాలను హైదరాబాద్‌ కేంద్రంగా నిర్వహించడంపై వైసీపీ సీనియర్లే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ పార్టీల‌న్నీ త‌మ పార్టీలు నవ్యాంధ్ర రాజధాని పరిసరాల్లో రాష్ట్ర కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయ‌ని, ప్రాంతీయ పార్టీగా వైసీపీ ఇంకా హైదరాబాద్‌లోనే తిష్ట వేయాల్సిన అవసరం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ప్రజా సమస్యలపై మీడియాతో మాట్లాడాలంటే ఏపీని వీడి.. హైదరాబాద్‌లోని కార్యాలయానికి ప్రత్యేకంగా రావాల్సి  వ‌స్తోంద‌ని వాపోతున్నారు. దీనివల్ల సొంత రాష్ట్రంలో మాట్లాడుతున్నామన్న భావన కల‌గ‌డం లేదంటున్నారు. దీనివల్ల రాజకీయంగా పార్టీకి న‌ష్ట‌మ‌ని వారు అసంతృప్తి వ్య‌క్తంచేస్తున్నారు. రాష్ట్రంలో కార్యాలయం లేని ఏకైక పార్టీ తమదేనని వైసీపీ నేతలు అంటున్నారు. ‘ఔట్‌ సోర్పింగ్‌ పార్టీ’లా తయారైందని ఆక్షేపిస్తున్నారు.

నిజానికి నవ్యాంధ్రకు తరలివెళ్లాక.. అసెంబ్లీలో బలాబలాల ఆధారంగా రాజకీయ పార్టీల కార్యాలయాల కోసం భూములు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. టీడీపీ మిత్రపక్షమైన బీజేపీకి ఇచ్చినంత స్థలాన్నే.. ప్రధాన ప్రతిపక్షమైన తమకూ ఇవ్వడంపై జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంతంగా భూమిని కొనుగోలు చేసి కార్యాలయం నిర్మించుకుందామ ని సన్నిహితులకు సూచించారు. అసెంబ్లీ, సచివాలయానికి సమీపంలోనే ఆఫీసు ఏర్పాటు చేసుకుందామని స‌ముదాయించార‌ట‌.