ఫైర్‌బ్రాండ్ రేణుక ఢిల్లీకే ప‌రిమిత‌మా?

ఒకప్పుడు ఖ‌మ్మం జిల్లాలో ఆమె ఎంత చెబితే అంత‌! ముఖ్య‌మంత్రి ఎవ‌రున్నా..వారెంత‌టివారైనా ఎన్నిక‌ల్లో ఎవ‌రికి టికెట్ ఇవ్వాలి? ఎవ‌రికి ఇవ్వ‌కూడ‌దు? అనే కీల‌క నిర్ణయాల‌న్నీ ఆమె క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగేవంటే ఆమె హ‌వా ఎంత‌లా జిల్లాలో కొన‌సాగిందో చెప్ప‌న‌వ‌స‌రంలేదు! ఆమె మ‌రెవ‌రో కాదు ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రేణుకా చౌద‌రి! కానీ కొంత‌కాలం నుంచీ ఆమె సైలెంట్ అయిపోయారు. అటు తెలంగాణ రాజ‌కీయాల్లోనే గాక‌, ఇటు ఏఐసీసీలోనూ ఆమె పేరు మ‌చ్చుకైనా వినిపించ‌డం లేదు. ఇప్పుడు ఆమె ఎక్క‌డున్నారు? ఎందుకు ఆమె పేరు వినిపించ‌డం లేదు? అనే ప్రశ్న‌లు ఇప్పుడు అంద‌రిలోనూ వినిపిస్తున్నాయి!!

ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగి, పార్టీ నిర్ణ‌యాల‌ను శాసించిన సీనియ‌ర్ నేత ఫైర్ బ్రాండ్ రేణుకా చౌద‌రి రాజ‌కీయాల నుంచి పూర్తిగా క‌నుమ‌రుగ‌య్యారు. అధికారంలో ఉండగా అంతా తానై చ‌క్రం తిప్పిన ఆమె అదృశ్యం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కాంగ్రెస్ అధికారంలో ఉండ‌గా.. రాష్ట్రంలో ఎవ‌రు ముఖ్య‌మంత్రిగా ఉన్నా.. ఖ‌మ్మంలో మాత్రం ఆమె హ‌వా కొన‌సాగుతుండేది.

జిల్లాలోని పది అసెంబ్లీ నియో జక వర్గాలలో కనీసం ఐదు స్థానాలలో తను చెప్పిన వారికే పార్టీ టికెట్లు వచ్చేవి అంటే ఆమె హవా ఎలా కొనసాగేదో అర్థం చేసుకోవచ్చు. నేరుగా ఢిల్లీ పెద్దల ద్వారా పార్టీలో తనను నమ్ముకున్న వారికి న్యాయం చేసేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించే వారు.

రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన చౌదరి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. పార్టీ అధిష్ఠానం రాష్ట్రాన్ని విభజించాలని తీసుకున్న నిర్ణయంతో ఆమె సైలంట్‌ అయ్యారు. 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అటు రాష్ట్రంలోనూ ఇటు దేశంలోనూ అధికారం కోల్పోవ‌డంతో తీవ్ర అసంతృప్తికి లోన‌య్యారు.

అప్ప‌టి నుంచి ఖ‌మ్మం జిల్లా రాజకీయాల‌కు దూరంగా ఉంటున్నార‌ని స‌మాచారం. అప్ప‌టి నుంచి ఢిల్లీకే ప‌రిమిత‌మ‌య్యార‌ట‌. కాగా పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి రావాల‌ని జానారెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కోరినా.. ఆమె ప్ర‌చారంలో పాల్గొన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం!