చంద్ర‌బాబుకు మోడీ చేసింది త‌క్కువ‌… చేయాల్సింది ఎక్కువ‌

ఏపీ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడేళ్లు కావొస్తోంది. శ‌క్తివంచ‌న లేకుండా శ్ర‌మిస్తూ.. కేంద్రంతో స‌ఖ్య‌త పాటిస్తూనే ఏపీకి రావాల్సిన‌వ‌న్నీ రాబ‌డుతున్నారు. ఇప్ప‌టికే పోల‌వ‌రానికి నాబార్డు రుణం ఇచ్చేలా ప్ర‌ధాని మోడీపై ఒత్తిడి తెచ్చి స‌ఫ‌ల‌మ‌య్యారు. అలాగే ముంపు మండ‌లాల‌ను ఏపీలో క‌లిపేలా చేసే ఆర్డినెన్స్‌ను కూడా తెచ్చేలా చ‌ర్చ‌లు జ‌రిపారు. అయితే వీటితోనే అయిపోయిందేమీ లేదంటున్నారు విశ్లేష‌కులు. మోడీని అడ‌గాల్సిన‌వి, ఆయ‌న‌తో చేయించాల్సిన‌వి చాలానే ఉన్నాయంటున్నారు. అవేంటో ఒక్క‌సారి చూద్దాం…

క‌డ‌ప జిల్లా పులివెందుల‌లో జ‌రిగిన స‌భ‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబు.. ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన వాట‌న్నింటినీ ఏక‌రువు పెట్టారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఏడు మండలాల్నిఏపీకి బదలాయించాల్సిందేనని, అలా చేస్తేనే ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తానని ఒత్తిడి తెచ్చాన‌ని అల్టిమేటం జారీ చేశాన‌ని బాబు తెలిపారు. ఇక చేసేది లేక ప్రధానిమోడీ, ఆ ఏడు మండలాల బదలాయింపుపై ఆర్డినెన్స్‌ని తీసుకొచ్చారని వివ‌రించారు.

అయితే వీటినే గొప్ప‌గా చెప్పుకోవడం కాద‌ని, ఇంకా రాష్ట్రానికి చేయాల్సివ‌ని.. మోడీని అడ‌గాల్సిన‌వి చాలానే ఉన్నాయ‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు. ముఖ్యంగా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా బ‌దులు ఇస్తామ‌న్న ప్ర‌త్యేక ప్యాకేజీ ఎప్ప‌టిలోగా ఇస్తారో క్లారిటీ లేదు. అలాగే విశాఖ‌కు ప్ర‌త్యేక జోన్ ఇవ్వాల‌ని ఎప్ప‌టినుంచో పోరాడుతున్నారు. దీనిపైనా కేంద్రం స‌మాధానం చెప్ప‌కుండా దాట‌వేస్తోంది.

అలాగే అద్భుత రాజ‌ధాని అమ‌రావ‌తిని నిర్మించాల‌ని బాబు కృత‌నిశ్చయంతో ఉన్నారు. అలాంటి రాజ‌ధానిని నిర్మించాలంటే కేంద్రం చేయూత త‌ప్ప‌నిస‌రి. మ‌రి దీనికి నిధులు ఏమిస్తుందో.. ఎంత ఇస్తుందో తెలీదు. మ‌రి వీట‌న్నింటి గురించి మోడీపై ఒత్తిడి తేవాల్సిన అవ‌స‌రం ఉందంటున్నారు.

ఏపీకి కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టు కోసం కొన్ని కోట్ల రూపాయ‌లు ఇవ్వాల్సి ఉన్నా బ‌డ్జెట్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి వంద కోట్లు కూడా ఇవ్వ‌డం లేదు. గ‌త బ‌డ్జెట్‌లో పోల‌వరం కోసం కేవ‌లం రూ.100 కోట్లు ఇచ్చింది. మ‌రి ఈ లెక్క‌న పోల‌వ‌రం ప్రాజెక్టు ఎప్ప‌ట‌కీ పూర్త‌వుతుందో తెలియ‌దు. ఏదేమైనా కేంద్రం ద్వారా చంద్ర‌బాబు చేయించుకునే ప‌నుల లెక్క చాలా ఉన్నా…ఆయ‌న మాత్రం ఇప్ప‌టికే ఎంతో చేసిన‌ట్టు చెప్పుకోవ‌డం స‌రికాద‌న్న చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.