మ‌రో అస్త్రంతో వ‌స్తున్న జ‌న‌సేనాని

ప్ర‌శ్నించ‌డానికే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌న్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌! అందుకోస‌మే జ‌న‌సేన పార్టీ పెట్టానని చెప్పాడు!! చెప్పిన‌ట్టుగానే ప్ర‌జా స‌మస్య‌ల‌పై పోరాటానికి సిద్ధ‌మ‌య్యాడు. టీడీపీ, బీజేపీల‌కు తొత్తుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడంటూ విమ‌ర్శించిన వారికి.. ఉద్దానం స‌మ‌స్య‌ను వెలుగులోకి తీసుకొచ్చి త‌గిన స‌మాధానమిచ్చాడు. అంతేగాక ప్ర‌భుత్వానికి డెడ్‌లైన్ విధించి స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో త‌న వంతు పాత్ర పోషించాడు. ఇప్పుడు ఒంగోలులో మ‌రో పోరాటానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. ప్ర‌భుత్వంపై మ‌రో అస్త్రం సంధించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాడు. ఇప్పుడు అక్క‌డ స‌మ‌స్య ఏమై ఉంటుందా అని తెగ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజాసమస్యలపై పోరాటాన్ని కొన‌సాగిస్తున్నారు. సమస్యలు ఉన్నప్రాంతాల్లో స‌భ‌లు నిర్వ‌హించి వారి `చీక‌టి` స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వ దృష్టికి తీసుకొస్తున్నారు. తిరుపతి, కాకినాడలలో హోదాపై కేంద్రంపై  ధ్వజమెత్తిన పవన్, అనంతపురంలో కరువు సమస్యని హైలైట్ చేశారు. అలాగే శ్రీ‌కాకుళంలో ఉద్దానంలో కిడ్నీ స‌మ‌స్య‌ను వెలుగులోకి తెచ్చి ప్ర‌భుత్వంలో క‌ద‌లిక తెచ్చారు. ఇప్పుడు ఒంగోలులో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించాడు.

స్థానికంగా ఒంగోలు జిల్లాలో ఉన్న సమస్యలపై పవన్ తన బహిరంగ సభలో ప్రస్తావిస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒంగోలు లో ఎలాంటి సమస్యలను వెలుగులోకి తెస్తారన్న ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. బహిరంగ సభల ద్వారా జనసేనను బలోపేతం చేయాలనేది పవన్ ఆలోచనగా చెబుతున్నారు. ఇదే విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించి తద్వారా జనసేన పార్టీ ప్రజా సమస్యలపై స్పందిస్తుందన్న సంకేతాలను ప్రజ‌ల్లోకి పంపాలని చూస్తున్నారు. జనవరి చివరి వారంలో ఈ బహిరంగ సభ జరిగే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాల సమాచారం.