రేవంత్‌పై ఆంధ్రా టీడీపీ ఫైర్‌

తెలంగాణ టీడీపీ నేత‌, కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై సొంత పార్టీలోనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక విష‌యంలో తెలంగాణ స‌ర్కారుని ఇరుకున పెట్టే రేవంత్‌.. త‌న వాగ్ధాటిని ఎప్ప‌టిక‌ప్పుడు మెరుగు ప‌రుచుకుంటూనే ఉంటారు. స‌మ‌యానికి త‌గ్గ‌ట్టుగా ఆయ‌న మాట్లాడుతుంటాడు కూడా. అయితే, ఇటీవల కాలంలో రేవంత్ చేస్తున్న కొన్ని ప్ర‌సంగాలు, కొన్ని డైలాగులు ఆంధ్రా నేత‌ల‌ను ఇరుకున పెడుతున్నాయ‌ట‌. ముఖ్యంగా రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు ఉన్న వాతావ‌ర‌ణాన్నే రేవంత్ ఇంకా కొన‌సాగిస్తుండ‌డం ఏంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

విష‌యం ఏంటంటే.. తెలంగాణలో టీడీపీకి ఉన్న ఏకైక బ‌లం రేవంత్ రెడ్డి. ప్ర‌స్తుతం టీడీపీ నుంచి ఎంతోమంది కీల‌క నేత‌లు స‌మ‌యం చూసుకుని సీఎం కేసీఆర్ చెంత‌కు చేరిపోయారు. దీంతో టీడీపీ దాదాపు డీలా ప‌డిపోయింది. ఈ క్ర‌మంలో 2019 ఎన్నిక‌ల నాటికి టీడీపీని పుంజుకునే లా చేయాల‌ని అధినేత చంద్ర‌బాబు గ‌ట్టివ్యూహంతోనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే టీటీడీపీ నేత‌ల దూకుడుకు ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

దీంతో ఇటీవ‌ల కాలంగా సీఎం కేసీఆర్, టీఆర్ ఎస్‌ల‌పై రేవంత్ రెచ్చిపోతున్నాడు. కేసీఆర్ ఏం చేసినా త‌ప్పుప‌డుతున్నాడు. ఇటీవ‌ల ఒలింపిక్ విజేత సింధుకు స్థ‌లం కేటాయించ‌డాన్ని కూడా రేవంత్ త‌ప్పుప‌ట్టారు. ఏపీ వాళ్ల ప‌ట్ల చూపిస్తున్న ప్రేమ తెలంగాణ వాళ్ల‌పై కేసీఆర్‌కి లేద‌ని విమ‌ర్శించారు. అదేవిధంగా ఏపీ ఇంజ‌నీర్ల‌కే కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నార‌ని కేసీఆర్‌ను దుయ్య‌బ‌ట్టాడు రేవంత్‌.

ఇప్పుడు దీనినే ఏపీ టీడీపీ నేత‌లు పాయింట్ అవుట్ చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయి రెండున్న‌రేళ్లు దాటింద‌ని, ఇంకా ప్రాంతీయ విభేదాల‌తోనే విమ‌ర్శ‌లు చేయ‌డం ఎందుక‌ని సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు. అదేస‌మ‌యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా తెలంగాణ వాళ్ల‌కి ప్రాధాన్యం ఇస్తున్న విష‌యాన్ని రేవంత్ గుర్తించాల‌ని వారు సూచిస్తున్నారు. మొత్తానికి రేవంత్‌కి సొంత పార్టీ నేతల నుంచి ఊహించ‌ని స్థాయిలో విమ‌ర్శ‌లు రావ‌డంతో ఒక‌ర‌కంగా ఇబ్బందిగా ఫీల‌వుతున్న‌ట్టు స‌మాచారం. మ‌రి త‌న పంథా మార్చుకుంటాడో లేదో చూడాలి.