టాలీవుడ్‌ను మ‌ర్డ‌ర్ చేస్తున్నారుగా..

టాలీవుడ్ మ‌ర్డ‌ర్ జ‌రిగిపోతోంది! చేజేతులా అభిమానులే త‌మ హీరోల భ‌విత‌వ్యాన్ని ఖూనీ చేసేస్తున్నారు. అభిమానం పేరిట ఇండ‌స్ట్రీని నిలువునా హ‌త్య చేసేస్తున్నారు. ఫ‌లితంగా టాలీవుడ్ తీవ్ర న‌ష్టాల్లో కూరుకుపోతోంది. హీరోలు త‌మ మూవీల విష‌యంలో కంటిపై కునుకు క‌రువై.. ఇబ్బంది ప‌డుతున్నారు. మొత్తంగా చూస్తే.. అభిమానం హ‌ద్దులు దాటి.. హీరోల‌కు తిప్ప‌లు తెస్తోంది. తాజాగా విడుద‌లైన అన్న‌య్య మూవీ ఖైదీపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. దాదాపు 100 రోజుల నుంచి 150 డేస్ అంచ‌నాలున్నాయి. అయితే, కొంద‌రు అభిమానులు చేస్తున్న చ‌ర్య‌ల‌తో ఈ రికార్డుకు ఎక్క‌డో ఒక చోట బ్రేక్ ప‌డే సూచ‌న‌లే క‌నిపిస్తున్నాయి.

ఖైదీ నెంబ‌ర్ 150 టాక్ పాజిటివ్ గా వుంది. అయితే ఇపుడు ఈ సినిమాపై సోషల్ మీడియా క‌త్తి క‌ట్టింది! అభిమానులు త‌మ అభిమానం పేరుతో చిరు మూవీని డ్యామేజీ చేసేస్తున్నారు. చిరు  సినిమా మొత్తం ఫేస్‌ బుక్, ట్విట్టర్ లో కనబడుతోంది. చిరంజీవి ఎంట్రీ వీడియో, ఫస్ట్ ఫైట్, అమ్మడు కుమ్మడు సాంగ్, ఇంటర్ వెల్ బ్యాంగ్ , చిరంజీవి ఎమోషనల్ సీన్, రత్తాలు సాంగ్ లో చిరు మాస్ డ్యాన్స్, సుందరి సాంగ్, కాయిన్ ఫైట్, కైమాక్స్ యాక్షన్ సీన్.. ఇలా సినిమాలోని కీలకమైన సన్నివేశాలన్నీ సదరు అభిమానుల ట్విట్టర్ పేస్ బుక్ లలో దర్శనమిస్తున్నాయి.

సినిమా వచ్చి ఒక రోజు కూడా పూర్తికాక ముందే ఇలా మూవీలోని కీల‌క‌మైన దృశ్యాలు లీకై సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తే.. ఎంత దారుణం!! నిజంగా ఇది అభిమానం చూపిస్తున్నట్లు కాదు. సినిమాని చంపేస్తున్నట్లు. ఇలాంటి అభిమానం హీరోలు కోరుకోరు. సినిమా అనేది ఒక థియేటిరికల్ ఎక్సపీరియన్స్. ఎంతో వ్యయ ప్రయాసలతో వెండితెరపైకి వస్తుంది సినిమా. ఒక మూవీ హిట్ మీద ఆధార‌ప‌డి కొన్ని వంద‌ల మంది జీవితాలు డిపెండ్ అయి ఉంటాయి. అలాంటిది సినిమా విడుదలై ఒక పుట కూడా గడవకుండానే ఇలా వీడియోలు తీసి ఇంటర్ నెల్ లో పెట్టడం ఏం అభిమానం అనిపించుకుంటుంది. ఇది అభిమానం కాదు.. ఖచ్చితంగా సినిమాని చంపేయడమే.

ఇక ఈ రోజు రిలీజ్ అయిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాలో కొన్ని వార్ స‌న్నివేశాలు సైతం అప్పుడే ఇంట‌ర్నెట్‌లో లీక్ అయ్యాయి. సినిమాకు సూప‌ర్ హిట్ టాక్ ఓ వైపు సోష‌ల్ మీడియాలో న‌డుస్తుంటే ఇప్పుడు మ‌రో వైపు ఈ సినిమా లీక్ స‌న్నివేశాలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక‌పై ఆయా హీరోల అభిమానులు, లేదా స‌ర‌దా కోసం చేసేవారో,  వేరే హీరో సినిమాను దెబ్బ కొట్టాల‌ని ఇలా చేసేవారో ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌కు స్వ‌స్తి ప‌లికితే మంచిది.