గంటా ప‌రిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

ఏపీ మాన‌వ‌వ‌న‌రుల మంత్రి గంటా శ్రీనివాస‌రావు.. ఇప్పుడు పెద్ద చిక్కుల్లో ప‌డ్డార‌ని తెలుస్తోంది. దీనికి ఏ చంద్ర‌బాబో. లేక మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రులో కార‌ణం అనుకుంటే పొర‌పాటే. అస‌లు మంత్రి వ‌ర్గంతో సంబంధం లేని మెగాస్టార్‌తో ఇప్పుడు గంటాకు ఇబ్బందులు ఎదురు కానున్నాయ‌ట‌. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. ప్ర‌స్తుతం గంటా ప‌రిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి చందంగా మారింద‌ట‌. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా భావిస్తున్న 150వ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150.. ప్రీ రిలీజ్ ఫ‌క్ష‌న్‌కి అన్ని ఏర్పాట్లూ పూర్త‌య్యాయి. దీనిని శ‌నివారం అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేశారు.

ఈ క్ర‌మంలో ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకావాలంటూ.. రాజ‌కీయ, సినీ ప్ర‌ముఖుల‌కు ఆహ్వానాలు అందాయి. వీరిలో మంత్రి గంటా కూడా ఉన్నారు. ఈయ‌న‌కు చిరు కుటుంబానికీ ఎప్ప‌టి నుంచో ప‌రిచ‌యం ఉంది. చిరు ప్ర‌జారాజ్యం స్థాపించిన స‌మ‌యంలో ఆపార్టీ లో చేరిన గంటా ఆ త‌ర్వాత చిరు త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డంతో గంటా కూడా కాంగ్రెస్‌లో చేరి మంత్రి ప‌ద‌విని కొట్టాశారు. ఆ త‌ర్వాత కూడా చిరుతో సంబంధాలు కొన‌సాగాయి. ప‌లు మూవీ ఫంక్ష‌న్ల‌లో పాల్గొన‌డం ద్వారా టాలీవుడ్‌కి గంటా చిర‌ప‌రిచితులే.

ఇంత‌వర‌కు బాగానే ఉన్నా.. అస‌లు చిక్కు ఏంటంటే.. చిరు మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి పోలీసులు విజ‌య‌వాడ‌లో ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు. దీంతో చిరు పిచ్చ కోపం మీద ఉన్నార‌ని టాక్‌. కేవ‌లం తాను కాంగ్రెస్‌కి చెందిన ఎంపీ కావ‌డం వ‌ల్లే త‌న మూవీకి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేద‌ని ఆయ‌న అనుకుంటున్నారు. దీంతో శ‌నివారం నాటి ఫంక్ష‌న్‌లో ఆయ‌న ప్ర‌భుత్వం పై త‌న‌కున్న అక్క‌సునంతా వెళ్ల‌గ‌క్కే ఛాన్స్ ఉంది.

ఒక వేళ ఫంక్ష‌న్‌కి హాజ‌రైతే.. మంత్రి గంటాకి ఇది ఇబ్బంది క‌ర ప‌రిణామం. మ‌రోప‌క్క‌, వైకాపాకి స‌న్నిహితంగాను, చంద్ర‌బాబుకి అత్యంత దూరంగాను ఉన్న ద‌ర్శ‌క‌రత్న దాస‌రి నారాయ‌ణ‌రావు సైతం ఈ ఫంక్ష‌న్‌కి వ‌స్తున్నారు. దీంతో ఈయ‌న‌తో క‌లిసి వేదిక‌ను పంచుకోవ‌డంపైనా గంటా ఇబ్బందిగా ఫీల‌వుతున్నార‌ని టాక్‌. దీంతో ఇప్పుడు గంటా.. చిరుతో పెద్ద తంటా వ‌చ్చిందే అని తెగ ఫీలైపోతున్నార‌ట‌.!!