ఏపీ పీసీసీ చీఫ్‌గా చిరు ,ర‌ఘువీరా వైసీపీలోకి జంప్..!

రాష్ట్ర విభ‌జ‌న దెబ్బ‌తో ఏపీలో కాంగ్రెస్ ఉనికే ప్ర‌శ్నార్థ‌క‌మైంది. కాంగ్రెస్ నుంచి ఎప్పుడు ఏ నాయ‌కుడు పార్టీకి గుడ్ బై చెపుతారో ? తెలియ‌ని పరిస్థితి ఉంది. అస‌లు ఏపీ కాంగ్రెస్‌లో కాస్త క్రేజ్ ఉన్న నాయ‌కులు ఎవ‌రా ? అని ప్ర‌శ్నించుకుంటే వేళ్ల‌మీద లెక్క‌పెట్టే ప‌రిస్థితి కూడా లేదు. అలాంటి కాంగ్రెస్‌లో మిణుగురుల్లా ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి లాంటి ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే ఉన్నారు.

అయితే ఇప్పుడు ఈ ఇద్ద‌రి మ‌ధ్యే పెద్ద గ్యాప్ వ‌చ్చింద‌ని ఏపీ కాంగ్రెస్ వ‌ర్గాల క‌థ‌నం. వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ పెర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఇటీవ‌ల ఏఐసీసీ చిరుకు బాగా ప్ర‌యారిటీ ఇవ్వ‌డ‌మే కార‌ణమ‌ట‌. ఈ క్ర‌మంలోనే ర‌ఘువీరా స్థానంలో చిరును ఏపీ పీసీసీ చీఫ్‌గా ప్ర‌క‌టించేందుకు ఏఐసీసీ రెడీగా ఉంద‌ని తెలుస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో ప్ర‌ధానంగా ఉన్న కాపు వ‌ర్గాన్ని టార్గెట్ చేసేందుకు చిరును సీఎం అభ్య‌ర్థిగా కూడా ప్ర‌క‌టించాల‌ని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ అధిష్టానం ర‌ఘువీరాకు తెలియ‌కుండా చిరుతో చ‌ర్చ‌లు జ‌రుపుతోంద‌ట‌. ఈ విష‌యం తెలిసిన ర‌ఘువీరా తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని….ఆయ‌న కాంగ్రెస్‌లో ప్ర‌యారిటీ లేక‌పోతే త‌న‌దారి తాను చూసుకుంటార‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.

కాంగ్రెస్ త‌న‌ను ప‌క్క‌న పెడుతుండ‌డంతో అసంతృప్తితో ఉన్న ఆయ‌న వైసీపీ వైపు చూస్తున్న‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న‌ను పీసీసీ చీఫ్‌గా త‌ప్పిస్తే వైసీపీలోకి జంప్ చేసేందుకు ఆయ‌న అన్నీ సిద్ధం చేసుకుంటున్న‌ట్టు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఖైదీ నెంబ‌ర్ 150 హిట్ అవ్వ‌డంతో వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు రెడీ అవుతోన్న చిరు మునిగిపోతోన్న కాంగ్రెస్ ప‌డ‌వ‌ను ఎంత వ‌ర‌కు ఒడ్డుకు చేరుస్తాడు ? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మే..?