ప‌వ‌న్ కొత్త ఫ్రెండ్ షిఫ్‌

పాలిటిక్స్ అన్నాక ఎప్పుడు ఎవ‌రు ఎవ‌రితో ఫ్రెండ్ షిప్ చేస్తారో? ఎప్పుడు ఎవ‌రితో తెగ‌తెంపులు చేసుకుంటారో?  చెప్ప‌డం క‌ష్టం. ఇప్పుడు ఇలాంటి వాతావర‌ణ‌మే జ‌న‌సేన, సీపీఐల మ‌ధ్య సాగుతోంద‌ని స‌మాచారం. తొలి నుంచి ఏదో ఒక పార్టీతో అంట‌కాగ‌డం త‌ప్ప సొంతంగా ఎన్నిక‌ల్లో పోటీ చేసే స‌త్తాలేని క‌మ్యూనిస్టులు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ‌కు క‌లిసివ‌చ్చే నేతలు, పార్టీల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. తాజాగా వారికి జ‌న‌సేనాని కొండంత అండ‌గా క‌నిపించాడ‌ట‌. వాస్త‌వానికి టీడీపీతో జ‌త క‌ట్టాల‌ని భావిస్తున్నా.. కామ్రెడ్ల‌ను చంద్ర‌బాబు.. చేర‌దీయ‌క‌పోగా, వీరి వైరి ప‌క్షం బీజేపీతో జ‌ట్టు క‌ట్టారు.

ఈ క్ర‌మంలో మ‌రో ప్ర‌త్యామ్నాయం త‌ప్ప‌దు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ పార్టీ వైకాపా ఉన్నా.. ఈ పార్టీకి సీపీఎం మ‌ద్ద‌తు ఇస్తోంది. దీంతో సీపీఎం కామ్రెడ్ల‌కు జ‌న‌సేనాని పెద్ద దిక్కుగా ప‌రిణ‌మించాడు. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఒక్క‌టంటే ఒక్క‌సీటును సైతం సాధించ‌లేక‌పోయిన ఎర్ర‌దండు… 2019లో మాత్రం అలాంటి ప‌రిణామం త‌లెత్త‌కుండా క‌నీసం ఇద్ద‌రు నుంచి ముగ్గురునైనా గెలిపించుకోవాల‌ని ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకుంది. ఈ నేప‌థ్యంలోనే సీపీఎం, సీపీఐలు త‌మకు న‌చ్చిన నేత‌లు, అందివ‌చ్చిన పార్టీల‌తో ఎన్నిక‌ల పొత్తుకు సిద్ధం అవుతున్నార‌నే టాక్ వ‌స్తోంది.

దీనికి మ‌ద్ద‌తుగానా? అన్న‌ట్టు.. సీపీఐ ఏపీ కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ, ఏఐటీయుసీ ఏపీ కౌన్సిల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖరరావులు తాజాగా.. జ‌న‌సేనాని ప‌వ‌న్‌ని క‌లిశారు.  వీరిని ప‌వ‌న్ సాద‌రంగా ఆహ్వానించ‌డం గ‌మ‌నార్హం. వీరి మ‌ధ్య ఏపీ ప్ర‌స్తుతం ఎదుర్కొంటొన్న స‌మ‌స్య‌ల‌తో పాటు, రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై కూడా చ‌ర్చ జ‌రిగిన‌ట్టు స‌మాచారం. దీంతో వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో వీరు క‌లిసి బ‌రిలోకి దిగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. వాస్త‌వానికి 2014లో జ‌న‌సేన ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోయినా.. టీడీపీ, బీజేపీల‌కు మ‌ద్ద‌తిచ్చింది.

అయితే, ఇప్ప‌డు ఆ ప‌రిస్థితిలేదు. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో బాబుతో ప‌వ‌న్ దాదాపు భారీగానే విభేదించారు. పాచిపోయిన ల‌డ్డూలుగా పోల్చారు. వీటిని బాబు ఎలా తీసుకుంటార‌ని ప్ర‌శ్నించారు. దీంతో 2019లో బాబుతో ప‌వ‌న్ జ‌ట్టుక‌ట్టే ప‌రిస్థితిలేదు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ కూడా ఆచితూచి కామెడ్ల‌ను ఆహ్వానిస్తున్నార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. ఇదిలావుంటే, అన్ని పార్టీల నేత‌ల‌పైనా సూటిపోటి మాట‌ల‌తో విరుచుకుప‌డే కామ్రెడ్లు సైతం ప‌వ‌న్ విష‌యంలో ఒక్క‌మాట కూడా అన‌లేదు. దీంతో ఈ ప‌రిణామాల‌న్నీ జ‌ట్టు దిశ‌గానే ఉన్నాయ‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో తెలియాలంటే..  2019 ఎన్నిక‌ల వ‌ర‌కు ఎదురు చూడాలి.