చిరు-బాల‌య్య హైద‌రాబాద్‌కు బై వెన‌క‌..!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అగ్ర‌హీరోలుగా ద‌శాబ్దాలుగా అభిమానుల‌ను ఉర్రూత‌లూగిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఈ ఇద్ద‌రు హీరోలు త‌మ కేరీర్‌లోనే ల్యాండ్ మార్క్ సినిమాల‌తో వ‌చ్చే సంక్రాంతి బ‌రిలో రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ టాప్ హీరోలిద్దరూ తమ తమ సినిమాలకి సంబంధించిన ఫస్ట్ లుక్స్.. టీజర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ రెండు సినిమాల ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్లు కూడా త్వ‌ర‌లోనే గ్రాండ్‌గా నిర్వ‌హించ‌నున్నారు.

ఈ ఆడియో ఫంక్ష‌న్లే టాలీవుడ్‌లో కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపాయి. ఇప్ప‌టిదాకా ఆడియో విడుదల కార్యక్రమాలంటే సాధారణంగా హైద‌రాబాద్‌లోని శిల్ప‌క‌ళావేదిక, హైటెక్స్‌లోనే నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఇటీవ‌ల ట్రెండ్ మారింది. ఏపీలోని విజయవాడ‌, విశాఖ, తిరుపతి లాంటి న‌గ‌రాలు కూడా వేదికలుగా మారాయి. ఇప్పుడు చిరు.. బాలయ్య‌ కూడా ఇదే రూటును ఎంచుకున్నారు. బాల‌య్య త‌న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ఆడియోను తిరుప‌తిలో రిలీజ్ చేస్తున్న‌ట్టు ఎనౌన్స్ చేశారు.

ఇక చిరు ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా ఆడియో రిలీజ్ ఈ నెల 25న విజయవాడలో జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు శ‌ర‌వేగండా జ‌రుగుతున్నాయి. ఇలా ఈ ఇద్ద‌రు స్టార్ హీరోలు హైద‌రాబాద్‌ను వ‌దిలి ఏపీ ఆడియో ఫంక్ష‌న్లు నిర్వ‌హించ‌డం వెన‌క ఆస‌క్తిక‌ర క‌థ‌నం వినిపిస్తోంది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత త‌మ‌కు కీల‌క‌మ‌న ఏపీ మార్కెట్ మీద దృష్టి పెట్ట‌డంతో పాటు ఇక్క‌డి అభిమానుల మ‌న‌స్సుల‌ను గెలుచుకునే క్ర‌మంలోనే ఈ ఇద్ద‌రు అగ్ర హీరోలు ఇలా హైద‌రాబాద్ అవతల ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ల‌ను నిర్వ‌హిస్తున్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాల క‌థ‌నం.