చంద్ర‌బాబుపై మోడీ స్పెష‌ల్ నిఘా

అదేంటి అని ఆశ్చ‌ర్య పోతున్నారా?! పాలిటిక్స్ అన్నాక అంతే! నిత్యం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని ఏదో ఒక సంద‌ర్భంలో పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తే చంద్ర‌బాబుకు ఇప్పుడు అదే మోడీ నిఘాతో చెక్ పెడుతున్నార‌నే టాక్ ఏపీలో వినిపిస్తోంది. విష‌యంలోకి వెళ్లిపోతే.. న‌ల్ల‌ధ‌నంపై పోరు స‌హా ఉగ్ర‌వాదాన్ని క‌ట్ట‌డి చేయ‌డంలో భాగంగా ప్ర‌ధాని మోడీ న‌వంబ‌రు 8న పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన వెంట‌నే తొలిసారి స్పందించిన ఏపీ సీఎం చంద్ర‌బాబు.. పెద్ద‌నోట్ల ర‌ద్దు మంచిద‌ని, అస‌లు అలా చేయాల‌ని తానే మోడీకి లేఖ‌రాశాన‌ని అన్నారు. దీంతో అప్ప‌టి ప‌రిస్థితిలో బాబు అనుచ‌రులు స‌హా అనుకూల మీడియా బాబును ఫ‌స్ట్ పేజీకి ఎత్తేసింది. ఇక‌, పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం దేశ వ్యాప్తంగా చిల్ల‌ర దొర‌క్క ప్ర‌జ‌లు నానా తిప్ప‌లు ప‌డ్డారు. ఇవే స‌మ‌స్య‌లు ఏపీలో నూ ప్ర‌జ‌లు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. బ్యాంకులు , ఏటీఎం కేంద్రాల వ‌ద్ద న‌గ‌దు కోసం ప‌డిగాపులు ప‌డుతున్నారు.

దీంతో కొన్నాళ్లుగా పెద్ద నోట్ల ర‌ద్దుపై ఒకింత వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. దీనిని గ‌మ‌నించిన చంద్ర‌బాబు.. ఈ ఎఫెక్ట్ త‌న‌మీద ప‌డుతుంద‌ని అనుకున్నారో ఏమో.. వెంట‌నే మాట మార్చారు. పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం చాలా పెద్ద స‌మ‌స్యగా మారింద‌నీ, ఇది మ‌నం కోరుకున్న‌ది కాద‌ని అన్న‌ది అనేశారు. అంతేకాదు, త‌న రాజ‌కీయ జీవితంలోనే ఇంత‌టి జ‌ఠిల‌మైన స‌మ‌స్య‌ను చూడ‌లేద‌న్నారు. ఇదే క్ర‌మంలో నోట్ల కొర‌త ప్ర‌భావం త‌న‌పై ప‌డ‌కుండా చూసుకునే క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్త బ్యాంక‌ర్ల భేటీని ఏర్పాటు చేసి.. అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఇక‌, ఈ విష‌యాల‌ను నిశితంగా గ‌మ‌నించిన మోడీ ప్ర‌భుత్వం.. పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత నెల కూడా గ‌డ‌వ‌కుండే నాలుగు సార్లు మాట మార్చిన బాబుపై నిఘా పెట్టింది. ఆయ‌న మాట్లాడుతున్న ప్ర‌తి మాట‌ను రికార్ఢ్ చేస్తోంది. దీంతో ఈ విష‌యం బాబుకు కూడా తెలిసిపోయింది. వెంట‌నే అలెర్ట్ అయిపోయిన చంద్ర‌బాబు.. ఇటీవ‌ల ప‌ది రోజులుగా ఆచి తూచి మాట్లాడుతున్నారు. పెద్ద నోట్ల ర‌ద్దుపై అస‌లు పెద్ద‌గా కామెంట్లు కూడా చేయ‌డం లేదు. సో.. మొత్తానికి బాబుపై మోడీ స్పెష‌ల్ నిఘా గ‌ట్టిగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది.