ఆ విష‌యంలో టీడీపీ సూప‌ర్ హిట్ – వైకాపా అట్ట‌ర్ ప్లాప్‌

రాజ‌కీయ పార్టీ అన్నాక అది ప్రాంతీయ‌మైనా, జాతీయ‌మైనా.. అధినేత‌లు, నేత‌లతోపాటు దిగువ స్థాయిలో జెండా మోసే కార్య‌క‌ర్త‌లూ ఉండాలి! ఈ విష‌యంలో దేశంలోని ఏ పార్టీ విభేదించే అవ‌కాశమే లేదు. వీలు దొరికిన‌ప్పుడల్లా పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేస్తున్నాం అనే మాట‌లు నేత‌ల నుంచి మ‌నకు త‌ర‌చు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో ప‌రిస్థితిని చూసుకుంటే.. ఏకైక విప‌క్షంగా ఉన్న వైకాపా.. 2019లో ఎట్టి ప‌రిస్థితిలోనూ అధికారంలోకి వ‌చ్చి తీరాల‌ని నిశ్చ‌యించుకుంది. ఈ నేప‌థ్యంలో ఆ పార్టీ క్షేత్ర‌స్థాయిలో త‌న బ‌లాన్ని, త‌న సంఖ్యా బ‌లాన్ని పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

క్షేత్ర‌స్థాయిలో బ‌లంగా ఉన్న పార్టీయే ఎన్నిక‌ల్లో త‌న ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంద‌నేది ఆనాటి ఎన్‌టీఆర్ నుంచి నేటి చంద్ర‌బాబు వ‌ర‌కు పెద్ద‌గా చెప్పే మాట‌. దీంతో టీడీపీ అధినేత ఖ‌చ్చితంగా పార్టీ స‌భ్య‌త్వాల‌కు ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే, ఇప్పుడు ఈ స‌భ్య‌త్వాల విష‌యంలో వైకాపా అధినేత జ‌గ‌న్ దారుణంగా వెనుక‌బ‌డ్డార‌ని పొలిటిక‌ల్ విశ్లేష‌కులు అంటున్నారు. 2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌యాన్ని నిర్దేశించుకున్న జ‌గ‌న్ ఇలా పార్టీ స‌భ్య‌త్వంపై ఉదాశీనంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారేంట‌ని వారు ఆశ్చ‌ర్య పోతున్నారు. వాస్త‌వానికి ప్ర‌తి రెండేళ్ల‌కు పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు చేప‌ట్టి.. క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేయాల‌ని పార్టీ రాజ్యాంగం(బైలాన్‌)లో రాసుకున్నారు జ‌గ‌న్‌.

అయితే, 2014 త‌ర్వాత ఎక్క‌డా ఈ రెండున్న‌రేళ్ల కాలంలో స‌భ్య‌త్వ న‌మోదుకు న‌డుం వంచ‌లేదు. మ‌రో రెండున్న‌రేళ్ల‌లో రాష్ట్రంలో ఎన్నిక‌ల న‌గారా మోగ‌నుంది. ఈ క్ర‌మంలో క్షేత్ర‌స్థాయిలో అండ‌దండా ఉన్న పార్టీల‌కే ప్ర‌జ‌ల‌కు మొగ్గు చూపుతారు త‌ప్ప‌.. ఇలా వ‌చ్చి అలా వెళ్లి.. నాలుగు మాట‌లు వండి వార్చే ప‌రిస్థితి ప్ర‌శ్నార్థ‌క‌మే. గ‌తంలో ప్ర‌జారాజ్యం ప‌రిస్థితి దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. సంస్థాగ‌తంగా వేళ్లూనుకోలేని ప‌రిస్థితిలోనే చిరంజీవి త‌న పార్టీని కాంగ్రెస్ పరం చేయాల్సి వ‌చ్చింది. ఇక‌, ఈ విష‌యంలో టీడీపీ ముందంజ‌లో ఉంది. ఇటు ఏపీ, అటు తెలంగాణ‌లోనూ టీడీపీ స‌భ్య‌త్వ న‌మోదుతో దూసుకుపోతోంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

అధునాతన సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించి రూ.100కి స‌భ్య‌ల‌ను చేర్చుకోవ‌డ‌మే కాకుండా ఆ వంద‌తో ప్ర‌మాద బీమాను కూడా అందిస్తుండ‌డంతో యువ‌త పెద్ద ఎత్తున టీడీపీ వైపు ప‌రుగు పెడుతున్నారు. మ‌రి ఈ క్ర‌మంలో పుంజుకోవాల్సిన వైకాపా.. ఆ దిశ‌గా ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేదు. ఇత‌ర పార్టీల నుంచి కొత్త‌గా వ‌చ్చేవారి కోసం అర్రులు చాస్తూ.. ఎదురు చూడ‌డం మిన‌హా నూత‌న స‌భ్య‌త్వాల ద్వారా కేడ‌ర్‌ను బ‌లోపేతం చేయాల‌నే ఆలోచన సైతం చేయ‌డం లేదు. ఇదే విష‌యంపై స్పందించిన ఆ పార్టీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి.. 2017లో స‌భ్య‌త్వ న‌మోదు చేప‌డ‌తామ‌ని అన్నారు. మ‌రి అప్ప‌టికైనా చేప‌డ‌తారో.. లేదా ఉన్న‌వాళ్లు చాల్లే అని ఊ కొడ‌తారో చూడాలి!!