మీడియాలో ప‌వ‌న్‌ను తొక్కేస్తున్నారా..!

రాజ‌కీయాల‌కూ.. మీడియాకు ఉన్న అవినాభావ సంబంధం అంతా ఇంతాకాదు. ఎవ‌రినైనా ఎత్తేయాల‌న్నా.. ఎవ‌రిని తొక్కేయాల‌న్నా.. మీడియాకు సాటి మ‌రొక‌టి లేదు!! 1980ల నుంచే ఉమ్మ‌డి ఏపీలో పాలిటిక్స్‌పై మీడియా ప్ర‌భావం భారీస్థాయిలో సాగింది. అప్ప‌ట్లో పార్టీ పెట్టిన టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్‌టీఆర్‌కి మీడియానే అండ‌గా నిలిచింద‌ని చెబుతారు. తాను వెళ్ల‌లేని చోట్ల‌కి సైతం మీడియా వెళ్లిందని, ఎన్‌టీఆర్‌కి పాజిటివ్‌గా ప‌నిచేసింద‌ని తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అప్ప‌ట్లో అధికారంలోకి వ‌చ్చారు. ఇప్పుడు కూడా ఏపీ పాలిటిక్స్‌లో మీడియానే ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంది. అధికారంలో ఉన్న టీడీపీకి ప‌ర‌క్షంలో రెండు ప‌త్రిక‌లు స‌హా నాలుగు ఛానెళ్లు ప‌నిచేస్తున్నాయి.

ఇక‌, విప‌క్ష నేత జ‌గ‌న్‌కి ప్ర‌త్యేకంగా ఓ మీడియా హౌజ్ ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో అటు చంద్ర‌బాబు, ఇటు జ‌గ‌న్‌ల‌ను ఫోక‌స్ చేసేందుకు మీడియాకు తెలుగునాట కొద‌వ‌లేదు. త‌మ త‌మ నేత‌ల‌ను ఈ మీడియా సంస్థ‌లు భారీ ఎత్తున ఫోక‌స్ చేస్తున్నాయి. ఎన్నిక‌ల సీజ‌న్ ప్రారంభం కాగానే ఈ మీడియా పాత్ర మ‌రింత‌గా పెరిగిపోతోంది. దీంతో త‌మ‌కు న‌చ్చిన నేత ఏం చేసినా.. ఎలా చేసినా.. ఫ‌స్ట్ పేజీల్లో కుమ్మేయ‌డం, న‌చ్చ‌ని నేత తాలూకు వార్త‌లు,క థ‌నాల‌ను లోప‌లి పేజీల్లో అంత ప్రాధాన్యం లేని అంశాలుగా ప్ర‌చురించ‌డం స‌హ‌జాతి స‌హ‌జం అయిపోయింది.

ఇక‌, ఇప్పుడు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. మీడియాకు సెంట‌ర్ పాయింట్‌లో నిలిచారు. వాస్త‌వానికి ఈయ‌న‌కు జ‌నాద‌ర‌ణ బాగానే ఉంది. మీడియా లెక్కల ప్ర‌కారం ఫ‌స్ట్ పేజీలో ఆయ‌న‌ను ఫొక‌స్ చేయొచ్చు. అయితే, అలా చేస్తే.. త‌మ నేత‌లు మ‌రుగున ప‌డిపోతారు. కాబ‌ట్టి సాధ్య‌మైనంత వేగంగా ప‌వ‌న్‌వార్త‌ల‌ను లోప‌ల‌కి పేజీల‌కు పంపేయ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నాయి మీడియా హౌజ్‌లు.

ఇక‌, ఎన్నిక‌ల సీజ‌న్ వ‌స్తే.. ఈ నిబంధ‌న‌లు మ‌రింత క‌ఠిన‌త‌రం కాక‌పోవు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ ఫోక‌స్ కావాలంటే.. ఆయ‌న‌కు కూడా ప్ర‌త్యేకంగా ఓ మీడియా హౌజ్ త‌ప్ప‌ద‌నే వాద‌న వినిపిస్తోంది. ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా ఓ మీడియా ఉంటేనే త‌ప్ప వెలుగులోకి రావ‌డం, ఆ త‌ర్వాత అధికారంలోకి రావ‌డం కుదిరేవికావు. సో.. ఇప్పుడున్న ప‌రిస్థితే కొన‌సాగితే.. మీడియా ప‌వ‌న్‌ని తొక్కేస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. 2009 ఎన్నిక‌ల‌కు ముందు చిరు ప్ర‌జారాజ్యం పార్టీ పెడితే ఎన్నిక‌ల‌కు ముందు చిరును ఆకాశానికి తీసుకువెళ్లి ఆ త‌ర్వాత నేల‌మీద‌ప‌డేశాయి. ఇప్పుడు మ‌రి ప‌వ‌న్ విష‌యంలో కూడా అదే జ‌రుగే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. అయితే అప్ప‌ట‌కీ ఇప్ప‌ట‌కీ సోష‌ల్ మీడియా ప్ర‌భావం బాగా పెరిగింద‌న్న విష‌యం కూడా గుర్తుంచుకోవాలి.