మాన‌వ‌త్వం చాటిన కేంద్ర మంత్రి

చిన్న చిన్న త్యాగాలు ఒక్కోసారి పెద్ద పెద్ద స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డంతోపాటు.. అంత‌క‌న్నా పెద్ద పేరును కూడా తెస్తాయి. ఇప్ప‌డు అలాంటి అతి చిన్న త్యాగంతో అతి పెద్ద పేరు సంపాదిస్తున్నారు కేంద్ర మంత్రి జ‌యంత్ సిన్హా. ప్ర‌జ‌ల‌కు అన్ని విధాలా మ‌నం చేయ‌గ‌లిగినంత సేవ చేయాల‌ని ప‌దేప‌దే చెబుతున్న ప్ర‌ధాని మోడీ మాట‌లు మంత్రి సిన్హా చెవికెక్కించుకున్నారో ఏమో.. ఓ ప్ర‌త్యేక సాయం చేసి.. స‌ర్వ‌త్రా అభినంద‌న‌లు అందుకుంటున్నారు. మ‌రి అదేంటో చూద్దాం.. శ్రేయ అనే యువ‌తి త‌న త‌ల్లితో క‌లిసి బెంగ‌ళూరు నుంచి రాంచీ బ‌య‌లుదేరారు. వీరు ఇండిగో విమానంలో ఎకాన‌మీ క్లాస్‌లో టికెట్టు రిజ‌ర్వ్ చేసుకున్నారు.

కానీ, శ్రేయ త‌ల్లి కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. అయితే, వీరు ఎక్కిన ఇండిగో విమానం బెంగ‌ళూరు నుంచి రాంచి చేర‌డానికి క‌నీసం 4 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. దీంతో ఆ పెద్దావిడ ఇబ్బందికి గుర‌య్యారు. కాళ్లు చాపుకుని ప‌డుకుని వెళ్లాల‌ని భావించారు. అయితే, ఎకాన‌మీ క్లాస్‌లో ఆ సౌక‌ర్యం లేక‌పోవ‌డంతో దిగులుతో కూర్చుండిపోయారు. అయితే, అదే విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నారు. శ్రేయ త‌ల్లి ప‌డుతున్న వేద‌న ఆయ‌న దృష్టికి వెళ్లింది.

దీంతో ఆయ‌న చ‌లించి పోయారు. మ‌నం ఆరోగ్యంగానే ఉన్నాం క‌దా.. ఆ పెద్దావిడ‌కి మ‌న సీట్లు ఇచ్చి ఆదుకుందాం అని త‌న భార్య‌తో చెప్పారు. మంత్రి గారి ఔదార్యానికి ముగ్ధురాలైన ఆయ‌న స‌తీమ‌ణి రెండో మాట లేకుండా ఓకే చెప్పార‌ట‌. దీంతో సిన్హా తమ రెండు సీట్లను ఆ తల్లీ కూతుళ్లకు ఇచ్చి, తాను భార్యతో సహా ఎకానమీ క్లాస్‌లోకి వెళ్లారు. దాంతో శ్రేయా తల్లికి  ఊరట లభించింది. ఆవిడ కాస్త కులాసాగా గ‌మ్యం చేరుకున్నారు.  అయితే, క‌థ ఇక్క‌డితో అయిపోలేదు.

త‌మకు ఇంత సాయం చేసిన మంత్రిగారితో శ్రేయ ఓ సెల్ఫీ కూడా దిగి.. దానిని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసి అచ్చేదిన్ అంటే ఇవేన‌ని పెద్ద కామెంట్ రాసింది. అంతే, దేశం మొత్తం స్పందించింది! మంత్రిగారి ఔదార్యాన్ని వేనోళ్ల కొనియాడింది. ఇప్ప‌టి వ‌ర‌కు 2900 లైకులు వ‌చ్చాయంటే.. మంత్రి గారి చ‌ర్య‌ను ఎంత‌మంది మెచ్చుకున్నారో తెలుస్తూనే ఉంది. సో.. కేంద్ర మంత్రి జయంత్ సిన్హా.. చిన్న త్యాగం.. గొప్ప పేరు! ఇద‌న్న‌మాట‌.