బాబుకు ఇంత అభ‌ద్ర‌త ఎందుకో..!

ఏపీ సీఎంగా టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు అధికార ప‌గ్గాలు చేప‌ట్టి దాదాపు రెండున్న‌రేళ్లు పూర్త‌వుతున్నాయి. ఆయ‌న చెంత 102 మంది టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక‌, మిత్ర ప‌క్షం బీజేపీకి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు కూడా బాబుకే మ‌ద్ద‌తిస్తున్నారు. ఇక‌, చంద్ర‌బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో సైకిల్ ఎక్కిన వైకాపా ఎమ్మెల్యేలు 20 మంది ఉన్నారు. దీంతో చంద్ర‌బాబు ఎలాంటి ఇబ్బందీ లేకుండా 2019 వ‌ర‌కు అధికారంలో ఉండే అవ‌కాశం ఉంది. ఈ విష‌యంలో ఎలాంటి అనుమానాలూ అక్క‌ర్లేదు.

అయినా.. కూడా .. చంద్ర‌బాబు ఎందుకో అభ‌ద్ర‌తా భావంతో కొట్టుమిట్టాడుతున్నార‌ని టాక్‌! వైకాపా నుంచి త‌న‌కు ఏదో తెలియ‌ని థ్రెట్ ఉంద‌ని ఆయ‌న విచారం వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. దీంతో మ‌రింత మంది వైకాపా ఎమ్మెల్యేల‌ను తాను ఆక‌ర్షించి సైకిల్ ఎక్కించేసుకుంటే ఇక ఎలాంటి ఇబ్బందీ ఉండ‌బోద‌ని బాబు ప్లాన్ వేస్తున్నారట‌. ఇంకేముంది బాబు ఆన‌తి అలా రాగానే టీడీపీ త‌మ్ముళ్లు ఇలా.. త‌మ వాయిస్‌ను వైకాపాపై ఎక్కుపెడుతున్నారు. తాజాగా, జ‌రిగిన ఓ ఘ‌ట‌న బాబు అండ్‌కోకి మరింత‌గా క‌లిసొచ్చింది.

త‌మ‌కు నిధులు ఇవ్వ‌డం లేద‌ని ఆరోపిస్తూ.. వైకాపా ఎమ్మెల్యేలు బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో అమ‌రావ‌తిలోని సీఎం చంద్ర‌బాబును శుక్ర‌వారం క‌లిశారు. గ‌తంలో తొమ్మిదేళ్లు పాలించిన మీరు ఎందుకు వివ‌క్ష చూపుతున్నార‌ని వారు సీఎం నిల‌దీశార‌ట‌. అయితే, బాబు మాత్రం.. మీరు జెండాలు మార్చుకుంటే మీకు కూడా అన్నీ వ‌స్తాయ‌ని, అన్నీ ఇస్తామ‌ని వారికి సూచించిన‌ట్టు తెలిసింది. దీంతో ఎమ్మెల్యేలు అంద‌రూ అవాక్క‌య్యార‌ట‌. అంతేకాకుండా.. ‘నన్ను కలిసిన వైకాపా ఎమ్మెల్యేలు, రాష్ట్ర అభివృద్ధి పట్ల సానుకూలంగా ఉన్నార‌ని, రాష్ట్రాభివృద్ధిలో భాగం పంచుకోలేకపోతున్నామని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని..’ అంటూ బాబు అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు.

అంటే దీన‌ర్ధం.. వాళ్ల‌లో కొంద‌రికి వైకాపాలో ఉండ‌డం ఇష్టంలేద‌ని టీడీపీ సైకిల్ ఎక్క‌నున్నార‌ని బాబు చెబుతున్నారు. అయితే, దీనిని మైండ్ గేమ్‌గా పేర్కొంటున్నారు వైకాపా స‌భ్యులు. ఇదిలావుంటే, టీడీపీకి చెందిన అధికార ప్ర‌తినిధులు ఒక‌రిద్ద‌రు రంగంలోకి దిగిపోయి.. వైకాపా నుంచి వ‌ల‌స‌లు కొన‌సాగుతాయ‌ని, ఇద్ద‌రు నుంచి ముగ్గురు పార్టీ మారేందుకు, ప‌చ్చ‌కండువా క‌ప్పుకొనేందుకు రెడీగా ఉన్నార‌ని ప్ర‌చారం మొద‌లు పెట్టారు. సో.. ఇదంతా చూస్తుంటే.. వైకాపా ఎమ్మెల్యేల సీఎం భేటీని కూడా బాబు త‌న‌కు అనుకూలంగా, వైకాపాకు వ్య‌తిరేకంగా మ‌లుచుకున్నార‌ని అనిపిస్తోంది. ఇంత అభ‌ద్ర‌తా భావంతో అధికారాన్ని ఎన్నాళ్లు నెట్టుకువ‌స్తార‌నే టాక్ కూడా విన‌బ‌డుతోంది.