అమ‌రావ‌తిపై ప్ర‌పంచ బ్యాంకుకు ఇన్ని డౌట్లా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎంతో ఎఫ‌ర్ట్ పెడుతున్న రాజ‌ధాని న‌గ‌రం అమ‌రావ‌తిపై ఇప్పుడు స‌ర్వ‌త్రా అనేక అనుమానాలు అలుముకున్నాయి. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత న‌గ‌రంగా రాబోయే ముప్పైఏళ్ల‌లో దేశానికి త‌ల‌మానికంగా తీర్చిదిద్దుతామ‌ని అమ‌రావ‌తి గురించి బాబు చెబుతున్న మాట‌లు అంత న‌మ్మ‌శ‌క్యంగా లేవ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజ‌ధాని ప్రాంత అభివృద్ధికి రుణాలు ఇచ్చే ప్ర‌పంచ బ్యాంకు వంటి పెద్ద సంస్థ‌లు సైతం చంద్ర‌బాబు మాట‌లను విశ్వ‌సించ‌డం లేద‌ని ఇప్పుడు పెద్ద టాక్ న‌డుస్తోంది.

అమ‌రావ‌తి అభివృద్ధికి సుమారు 58 వేల కోట్ల రూపాయ‌లు అప్పుగా తేవాల‌ని బాబు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో ఈ బాధ్య‌త‌ను అధికారుల‌కు అప్ప‌గించారు. అప్పు ఇచ్చేవారి కోసం, పెట్టుబ‌డులు పెట్టేవారి కోసం అన్వేష‌ణ సాగుతోంది. ఈ క్ర‌మంలో రూ.4 వేల కోట్ల అప్పుకోసం  క్రెడా(కేపిట‌ల్ రీజియ‌న్ ఎంప‌వ‌రింగ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అధారిటీ) అధికారులు

ప్ర‌పంచ బ్యాంకును సంప్ర‌దించారు. అయితే, దీనిపై బ్యాంకు అధికారులు సందేహాలు వ్య‌క్తం చేశారు. ఈ అప్పు తీర్చే శక్తి వుందా అంటూ ఆలోచనలో పడ్డార‌ని స‌మాచారం. ముఖ్యంగా రాజ‌ధాని డెవ‌ల‌ప్ మెంట్ కింద మెకెన్సీ కంపెనీ ఇచ్చిన నివేదిక‌లు సంతృప్తి క‌లిగించ‌లేద‌ని తెలిసింది.

ఇంత పెద్ద అప్పును తీర్చే ప‌రిస్థితి అమ‌రావ‌తి ఉందా? అనే కోణంలో బ్యాంకు అధికారులు యోచిస్తున్నార‌ట‌. ఇదిలావుంటే, ఐపిఎప్‌,ఎల్‌ఐసి వంటివి ఇప్పటికే రుణాల మంజూరుకు నిరాకరించాయి. హడ్కోతో మాత్రం చర్చలు సాగుతున్నాయి. రెండు మూడు విడ‌త‌ల్లో రూ.450 కోట్లు ఇచ్చేందుకు హ‌డ్కో ఒప్పందం చేసుకోవ‌డం ఒక్క‌టే ఇక్క‌డ ఆస‌క్తిక‌ర ప‌రిణామం. అది కూడా రోడ్ల నిర్మాణానికి మాత్ర‌మే!. ఇక‌, కేంద్రం నుంచి ఏదైనా సాయం వ‌స్తుందా? అంటే అది కూడా అంతంత మాత్రమేన‌నే స‌మాధానం వ‌స్తోంది.

ఇప్ప‌టికే రెండున్న‌రేళ్లు గ‌డిచిపోవ‌డం, మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌ల టైం ముంచుకురావ‌డంతో భారీ ఎత్తున ఏమీ వ‌చ్చే ఛాన్స్‌లేదు. పైగా.. ఇప్ప‌టికే పోల‌వ‌రానికి సంబంధించే ప్ర‌తి విష‌యంలోనూ లెక్క‌లు అడుగుతున్న కేంద్రం అమ‌రావ‌తి విష‌యంలోనూ లెక్క‌లు కోరుతోంది. అయితే, ఇక్క‌డ ప‌నులు మాత్రం ముందుకు సాగ‌క‌పోవ‌డంతో అధికారులు ఏం చేయాలో తెలియ‌క స‌త‌మ‌తం అవుతున్నారు.  అయితే, చంద్ర‌బాబు మాత్రం అమ‌రావ‌తిలో ఏదో జ‌రిగిపోతోంద‌నే టాక్ వ‌చ్చేలా నిత్యం జాతీయ‌, అంత‌ర్జాతీయ ప్ర‌తినిధుల‌తో భేటీలు, స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.

 ఎన్ని స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నా.. ఇప్ప‌టికి కేవ‌లం  మూడు గ్రామాల్లో మాత్రమే అంతర్గత రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ భూమి చదును దశలోనే వుండిపోయింది.  ఈ లోగా పెద్ద నోట్లరద్దుతో భూముల రేట్లపై ఆశలు అడుగంటాయి. విజయవాడకు అనుసంధానం, కృష్ణానది నీటి సరఫరా, హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్ల మార్పు వంటివి కూడా ముందుకు సాగలేదు. దీంతో అప్పులు ఇచ్చే వారు ఎవ‌రూ ముందుకు వ‌చ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే అమ‌రావ‌తి.. భ్ర‌మ‌రావ‌తా? అనే సందేహాలు వ్య‌క్తం కావ‌డం స‌హ‌జ‌మేక‌దా!!