ప‌వ‌న్ ముందుకు మీడియా పంచాయితీ

ఇప్పుడు ఏపీలో ఎవ‌రికి ఏ క‌ష్ట‌మొచ్చినా.. రివ్వున వెళ్లి.. జ‌న‌సేనాని గుమ్మం ముందు వాలిపోతున్నారు! మా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించు మ‌హాప్ర‌భో అంటూ జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్‌కి త‌మ‌గోడు వెళ్ల‌బోసుకుంటున్నారు. అదేస‌మ‌యంలో ఏపీ ప్ర‌భుత్వం త‌మ‌ను పెడుతున్న క‌ష్టాల‌ను కూడా ఎక‌ర‌వు పెడుతున్నారు. 2014లో జ‌న‌సేన పార్టీని పెట్టిన ప‌వ‌న్‌కి జ‌నాల్లో పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ఉంది. అప్ప‌టి ఎన్న‌క‌ల్లో టీడీపీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తిచ్చి గెలిపించిన ప‌వ‌న్ త‌ర్వాత దూరంగా ఉన్నారు.

అయితే, ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి భూముల వ్య‌వ‌హారం వెలుగు చూసిన‌ప్పుడు ప్ర‌భుత్వం త‌మ‌పై ఉక్కుపాదం మోపుతోంద‌ని పేర్కొన్నారు. తమ భూముల‌ను బ‌ల‌వంతంగా తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని ప‌లు గ్రామాల రైతుల ప‌వ‌న్‌ను తొలిసారి హైద‌రాబాద్‌లో క‌లిశారు. దీంతో స్పందించిన ప‌వ‌న్‌.. వెనువెంట‌నే రంగంలోకి మంగ‌ళ‌గిరికి వెళ్లి రైతుల‌తో ముచ్చ‌టించారు. ప్ర‌భుత్వానికి కొన్ని సూచ‌న‌లు చేశారు. ఈ క్ర‌మంలోనే రైతులకు ఉప‌శ‌మ‌నం క‌లిగేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇక‌, మొన్నామ‌ధ్య ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం రైతులు కూడా పెద్ద ఎత్తున సీఎంని క‌లిశారు.

అక్క‌డ ఏర్పాటు చేస్తున్న ఆక్వా ప‌రిశ్ర‌మ‌తో త‌మ భూములు నాశ‌నం అవుతాయ‌ని, ఈ విష‌యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిరంకుశంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని వారు ప‌వ‌న్‌కి చెప్పారు. దీంతో ప‌బ్లిక్ గార్డెన్‌లో మీటింగ్ పెట్టిన చంద్ర‌బాబు.. త‌ర్వాత ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు చేయ‌డంతో ఆ సమ‌స్య‌పైనా చంద్ర‌బాబు స్పందించారు.  దీంతో అక్క‌డి రైతులు, వారి కుటుంబాలు కొంత మేర‌కు ఉప‌శ‌మ‌నం పొందాయి. ఇక‌, ఇప్పుడు ఇదే బాట‌లో ఏపీ జ‌ర్న‌లిస్టులు కూడా న‌డిచారు. తాము గ‌త కొన్నాళ్లుగా ఎదుర్కొంటున్న హెల్త్ కార్డుల స‌మ‌స్య‌ను ప‌వ‌న్ దృష్టికి తీసుకువెళ్లారు.

ప్ర‌భుత్వం దీనిపై సానుకూలంగానే ఉన్నా.. ప‌నిమాత్రం జ‌ర‌గ‌డం లేద‌ని వారు ప‌వ‌న్‌కి వివ‌రించారు. హెల్త్ కార్డులు ప‌నిచేయ‌క‌, డ‌బ్బులు రీయింబ‌ర్స్ కాక ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో స్పందించిన ప‌వ‌న్ తాను మాట్లాడ‌తాన‌ని హామీ ఇచ్చిన‌ట్టు తెలిసింది. మొత్తానికి ప‌వ‌న్ ని న‌మ్ముకునే ప్ర‌భుత్వ బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.