నోట్ల ర‌ద్దు వెన‌క బీజేపీ బ్ర‌హ్మ‌చారులు

దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఏ వార్తా ఛానెల్ చూసినా, ఏ పేప‌ర్ చూసినా.. ఆఖ‌రికి ఏ ఇద్ద‌రు క‌లిసినా.. నోట్ల ర‌ద్దు విష‌యమే క‌నిపిస్తోంది.. వినిపిస్తోంది! ఇక‌, నెటిజ‌న్ల తీరే వేరు క‌దా.. సోష‌ల్ మీడియాలో అయితే, కామెంట్ల‌కు, జోక్‌ల‌కు కొద‌వేలేదు. ఇప్పుడు ఈ జాబితాలో చేరిపోయారు యోగా గురువు రాందేవ్ బాబా. న‌ల్ల‌ధ‌నంపై పోరును ఆయ‌న స్వాగ‌తిస్తూనే కొన్ని ఆస‌క్తి క‌ర కామెంట్లు చేశారు. ప్ర‌స్తుతం పెద్ద నోట్ల ర‌ద్దుతో దేశ వ్యాప్తంగా అనేక లావాదేవీలే కాకుండా పెళ్లిళ్లు కూడా నిలిచిపోయాయి.

దీనిపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. ఈ క్ర‌మంలో స్పందించిన కేంద్ర ప్ర‌భుత్వం.. సుమారు.. 2.50 ల‌క్ష‌ల వ‌ర‌కు బ్యాంకు నుంచి డ్రా చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. అయితే, దీనికి సంబంధించి పెళ్లి కార్డు, ఇత‌ర గుర్తింపు కార్డుల‌ను కూడా చూపాల‌ని ఆదేశించింది. ఇంతవ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు దీనిపైనే యోగా గురువు రాం దేవ్ బాబా స‌ర‌దా వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీలో ఉన్న‌వారిలో ఎక్కువ భాగం బ్ర‌హ్మ‌చారులేన‌ని ఆయ‌న అన్నారు. అందుకే వాళ్ల‌కి పెళ్లిళ్ల సీజ‌న్‌, పెళ్లిళ్ల ఖ‌ర్చులు, క‌ట్నాలు, విందులు, వినోదాలు వంటివి తెలియ‌ద‌ని, దీంతో కాలం కాని కాలంలో క‌ష్టాలు తెచ్చి పెట్టార‌ని వ్యాఖ్యానించారు.

 ‘బీజేపీలో చాలామంది బ్రహ్మచారులే. అందుకే వారికి ఇది పెళ్లిళ్ల సీజన్‌ అని తెలియలేదు. అది వారి పొరపాటు’ అంటు జోక్‌ చేశారు. ‘15 లేదా నెలరోజుల తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఉంటే పెళ్లిళ్లు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొనేవి కావు. అని ముక్తాయించారు. అదేస‌మ‌యంలో బాబా.. పెద్ద నోట్ల ర‌ద్దును బ‌ల‌ప‌రుస్తూ.. ఈ నోట్ల ర‌ద్దుతో పెళ్లి కొడుకులు లైన్‌లోకి వ‌చ్చార‌ని, క‌ట్నాలు తీసుకోవ‌డం నిలిచిపోయింద‌ని, ఇది బేఠీకి భ‌లే మంచి చేసింద‌ని ప‌రోక్షంగా మోడీకి కితాబిచ్చారు. మొత్తానికి ఏదో సామెత చెప్పిన‌ట్టు బాబా వ్యాఖ్యానించార‌ని అంటున్నారు నెటిజ‌న్లు.