లైవ్‌లో క‌నిపించిన అంత‌రిక్షంలో ఎగిరే వ‌స్తువు!

అంత‌రిక్షంలో అద్భుతాలపై జ‌రుగుతున్న వేట ఈనాటిది కాదు! అస‌లు అక్క‌డ ఏం జ‌రుగుతోంది? ఎవ‌రుంటారు? ఏం చేస్తారు? ఫ‌్ల‌యింగ్ ప్లేట్స్‌(ఎగిరే ప‌ళ్లాలు), యూఎఫ్‌వో(అన్ ఐడెంటిఫీడ్ ఫ్ల‌యింగ్ ఆబ్జెక్ట్‌)(గుర్తించ‌లేని ఎగిరే వ‌స్తువు/ప‌దార్థం) వంటి అనేక‌మైన అంతు చిక్క‌ని అంశాల‌పై నేటికీ అనేక ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో అంత‌రిక్షానికి సంబంధించిన ఎలాంటి చిన్న వార్త‌, లేదా స‌మాచారం వ‌చ్చిన అది పెద్ద ఎత్తున ప్ర‌చారంలోకి వ‌చ్చేస్తోంది. తాజాగా అలాంటి ఘ‌ట‌న ఒక‌టి వెలుగు లోకి వ‌చ్చింది. దీంతో ఇప్పుడు మ‌రోసారి అంత‌రిక్షంలో ఏం జ‌రుగుతోంద‌నే విష‌యంపై ఆస‌క్తి నెల‌కొంది.

అంత‌రిక్ష స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు అమెరికాకు చెందిన నాసా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంటుంది. అదే క్ర‌మంలో తాజాగా వ‌చ్చిన లైవ్ ప్రోగ్రాంలో రోదసిలో భూపరిధికి కాస్త ఎత్తులో చీకటి నుంచి వేగంగా ప్రయాణిస్తున్న చిన్న చుక్కలాంటి వస్తువు ఒక్కటి క‌నిపించింది. అది కూడా అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రానికి అతి స‌మీపం నుంచి వెళ్ల‌డం క‌నిపించింది. దీంతో దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ ప్రారంభ‌మైంది. అది యూఎఫ్‌వో (గుర్తించ‌లేని ఎగిరే వస్తువు) అయి ఉంటుందని పలువురు నెటిజన్లు అభిప్రాయప‌డ్డారు. అయితే, ఇంత‌లోనే నాసా త‌న ప్ర‌సారాల‌ను నిలిపివేసింది.

వాస్త‌వానికి అలా ప్ర‌సారాల‌ను నిలిపివేయాల్సిన అవ‌స‌రం లేదు. అంత‌రిక్షంలో ఎన్నో తోక‌చుక్క‌లు రాలి ప‌డుతూ ఉంటాయి. ఈ క్ర‌మంలోనే అనేక సార్లు అవి లైవ్‌లోనూ క‌నిపించాయి. కానీ, ఇప్పుడు మాత్రం నాసా లైవ్ ప్ర‌సారాల‌ను నిలిపివేసిన నేప‌థ్యంలో ఈ విష‌యంపై క్యూరియాసిటీ మ‌రింత‌గా పెరిగిపోయింది.  లైవ్‌లో ఇది ఐదు సెకన్లు మాత్రమే కనిపించింది. ఆ వెంటనే లైవ్‌ ప్రసారాలు నిలిచిపోయాయి.

ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన ‘కోల్డ్‌పైరో’ అనే నెటిజన్ ఇది యూఎఫ్‌వో అయి ఉంటుందని, దీనిని గుట్టుగా ఉంచేందుకే నాసా లైవ్‌ ప్రసారాల్ని అకస్మాత్తుగా కట్‌ చేసిందని వ్యాఖ్యానించాడు. అయితే సాంకేతిక కారణాల వల్లే లైవ్‌ ప్రసారం నిలిచిపోయిందని నాసా పేర్కొంది. మొత్తానికి అంత‌రిక్షం గురించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగు చూసింది.