నోట్ల ఎఫెక్ట్ నిల్‌….మ‌హారాష్ట్ర‌లో బీజేపీ సూప‌ర్ విన్‌

దేశంలో రాత్రికి రాత్రి జ‌రిగిన పెద్ద నోట్ల ర‌ద్దు ప‌రిణామం త‌ర్వాత ప్ర‌జ‌లు తీవ్రంగా ఇబ్బందులు ప‌డ్డారు. ఏటీఎంలు, బ్యాంకుల వ‌ద్ద క్యూలైన్ల‌లో నిల‌బ‌డ‌లేక ప‌దుల సంఖ్య‌లో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. మొద‌టి నాలుగు రోజులు ఈ నోట్ల ర‌ద్దుతో న‌ల్ల‌ధ‌నం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని సంతోషించిన ప్ర‌జ‌లు త‌ర్వాత ఈ క‌ష్టాలు త‌మ‌ను ఇబ్బంది పెట్టేస‌రికి అవాక్క‌య్యారు. దీంతో కాంగ్రెస్ స‌హా అన్ని విప‌క్షాలూ.. పెద్ద ఎత్తున మోడీపై విరుచుకుప‌డ్డాయి. ఈ ప‌రిణామం బీజేపీ తీవ్రంగా ఇరుకున పెట్టేదేన‌ని అంద‌రూ భావించారు. మోడీ రేటింగ్ కూడా త‌గ్గిపోయింద‌ని అంద‌రూ అన్నారు.

అయితే, అనూహ్యంగా ఈ నోట్ల ర‌ద్దు ప్ర‌భావం ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం అంద‌రినీ ఇప్ప‌డు ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. తాజాగా ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. ఇక‌, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న మ‌హారాష్ట్ర లోనూ ఎన్నిక‌లు జ‌రిగాయి. మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల మొదటి దశలో బీజేపీ భారీ విజయాలు సాధించింది. మొత్తం 164 స్థానిక సంస్థల్లో 851 వార్డు/ డివిజన్ సీట్లు గెలుచుకుంది. దీంతో మోడీపై వ్య‌తిరేక‌త ఉందంటూ వ‌చ్చిన వార్త‌ల్లో ప‌స‌లేద‌ని అర్ధ‌మైపోయింది.

పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజల్లో కేంద్రంలోని అధికార బీజేపీ మీద వ్యతిరేకత ఉందా.. లేదా అనే విషయాన్ని ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయని పార్టీ నాయకులు అంటున్నారు. మొత్తం 147 మునిసిపాలిటీలు, 17 నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలోని 25 జిల్లాల్లో జరిగిన ఈ మునిసిపల్ ఎన్నికలను అందరూ మినీ అసెంబ్లీ ఎన్నికలుగా భావించారు. ముఖ్యంగా పెద్ద నోట్ల ర‌ద్దుతో నానా తిప్ప‌లు ప‌డుతున్న జ‌నాలు మోడీకి త‌మ త‌డాఖా చూపిస్తార‌ని కాంగ్రెస్ భావించింది. అయితే, అది ఉత్తుత్తిదేన‌ని, పెద్ద‌నోట్ల ర‌ద్దును ప్ర‌జ‌లు స‌మ‌ర్ధిస్తున్నార‌ని తేలిపోవ‌డం గ‌మ‌నార్హం.