జ‌న‌సేన‌లోకి టీడీపీ ఎమ్మెల్యే..!

పాలిటిక్స్ అన్నాక శాశ్వ‌త మిత్రులు ఉండ‌రు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు అంటారు! అప్ప‌టి వ‌ర‌కు ఒక పార్టీలో మంత్రులుగా అధికారం చ‌లాయించి, పార్టీ అధినాయ‌క‌త్వంతో రాసుకు పూసుకొని తిరిగిన నేత‌లు.. అధికారం చేయి మారిన మ‌రుక్ష‌ణం అప్ప‌టి వ‌ర‌కు మోసిన పార్టీ జెండాను ప‌క్క‌న ప‌డేసి.. పార్టీలు మారుతున్న‌ సందర్భాలు అనేకం! ఈ విష‌యంలో ఎవ‌రి ప్ర‌యోజ‌నాలు వారివి!! ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ప్ర‌స్తుతం ఇంకా పూర్తిస్థాయిలో కేడ‌ర్‌ త‌యారు కాని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన‌లోకి ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు జంప్ చేస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

బొండా ఉమా.. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. దీంతో ఆయ‌న చూపుల‌న్నీ జ‌న‌సేన వైపు ఉన్నాయ‌ని అంటున్నారు. గ‌తంలోనూ ఆయ‌న ప‌వ‌న్ అన్న చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యంలో కొన‌సాగారు. అయితే, అది కాంగ్రెస్‌లో విలీనం అయిపోయిన నేప‌థ్యంలో టీడీపీలో చేరి త‌న‌కంటూ ఓ స్టేజ్‌ని సంపాదించుకున్నారు. ఇక‌, ఇప్పుడు సెంట్ర‌ల్ ఎమ్మెల్యేగా.. గ‌ట్టి వాయిస్ ఉన్న నేత‌గా చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మంచి మార్కులే సంపాదించుకున్నారు. అసెంబ్లీలో వైకాపా నేత‌ల‌పై బొండా ఉమా పెద్ద ఎత్తున చేసిన విమ‌ర్శ‌లు రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాయి. దీంతో అధినేత దృష్టి కూడా బొండాపై ప‌డింది.

ఈ క్ర‌మంలో కొంద‌రు బొండా అనుచ‌రులు.. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే బాగుంటుంద‌నే అభిప్రాయాన్ని బ‌హిరంగంగా వెల్ల‌డించారు. అంతేకాదు, సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కొన్ని బ్యాన‌ర్లు కూడా వెలిశాయి. అంటే.. బొండా మంత్రి ప‌ద‌విని ఆశిస్తున్నార‌నే విష‌యం వెల్ల‌డైంది. కానీ, నేరుగా బొండా దీనిపై ఎలాంటి కామెంట్లు చేయ‌లేదు. ఇక‌, ఇప్పుడున్న ప‌రిస్థితిలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మంచి పోటీ నెల‌కొంది. సో.. బొండా ఆశ‌లు నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. దీంతో ఆయ‌న త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌వ‌న్ చెంత చేరి.. త‌న మ‌న‌సులో కోరికను తీర్చుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప‌వ‌న్‌ను విమ‌ర్శించే వాళ్ల‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. అదేవిధంగా ప‌వ‌న్ టీడీపీని తిట్టిపోసినా.. వెనువెంట‌నే రంగంలోకి దిగిపోయి.. ఆ తిట్ట‌ను స‌ద్విమ‌ర్శ‌లుగా పేర్కొంటూ.. స‌మ‌ర్ధించేస్తున్నారు. అనంత స‌భ‌లో టీడీపీ నేత‌లు అవినీతికి కేరాఫ్‌గా మారారంటూ.. ప‌వ‌న్ విమ‌ర్శించినా.. వాటిని పాజిటివ్‌గానే తీసుకుంటామ‌ని బొండా స్ప‌ష్టం చేశారు. ఇక‌, గ‌తంలో ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూల‌తో పోల్చ‌డంపై టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేష్‌.. ప‌వ‌న్‌పై నిప్పులు చెరిగారు. ఆ విష‌యంలో కూడా బొండా టీజీకి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు.

ఇది(టీడీపీ) కాంగ్రెస్ కాదు. ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడ‌డానికి అంటూ విరుచుకుప‌డ్డారు. అయితే, ఇప్ప‌టికిప్పుడు బొండా పార్టీ మారేప‌రిస్థితి ఉండ‌దు. కానీ,, 2019 ఎన్నిక‌ల నాటికి ఆయ‌న ఓ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది.