చంద్ర‌బాబు ” వాస్తు ” హిట్ కొట్టిందా

ఏపీ సీఎం చంద్ర‌బాబు నోట వాస్తు వ్యాఖ్య‌లు వ‌చ్చాయి. వాస్త‌వానికి టెక్నాల‌జీని న‌మ్మే ఆయ‌న వాస్తును న‌మ్ముతున్న‌ట్టు చెప్ప‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తి క‌లిగించింది. ఇటీవల ఆయ‌న వెల‌గపూడిలో నిర్మించిన నూత‌న స‌చివాల‌యంలో త‌న ఛాంబ‌ర్‌ను బాబు ప్రారంభించారు. పూర్తి వాస్తు ప్ర‌మాణాల‌తో ఈ ఛాంబ‌ర్‌ను నిర్మించారు. ఇక‌, త‌న ఛాంబ‌ర్‌ను ఇటీవ‌ల ప్రారంభించిన బాబు.. ప్ర‌స్తుతం అక్క‌డి నుంచే పాల‌న సాగిస్తున్నారు. అదేవిధంగా త‌న ఛాంబ‌ర్‌లోకి ప్ర‌వేశించిన సంద‌ర్భంగా చంద్ర‌బాబు రెండు సంత‌కాలు చేసిన విష‌యం తెలిసిందే.

 

ఈ సంత‌కాల గురించి సీఎం మాట్లాడుతూ.. త‌న కార్యాల‌యం వాస్తు ఫ‌లితంగా తాను పెట్టిన సంత‌కాలు, తీసుకున్న నిర‌ణ‌యాలు మంచి రిజ‌ల్ట్ ఇచ్చాయ‌ని చెప్పారు. ఇక‌, త‌న సంత‌కాల గురించి చంద్ర‌బాబే స్వ‌యంగా వివ‌రించారు. మొద‌టిది… ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి లేఖ రాయ‌డం! న‌ల్ల‌ధ‌నం నిర్మూల‌న‌పై సూచ‌న‌లు చేస్తూ ఆయ‌న‌కి లేఖ రాసి సంత‌కం పెట్టార‌ట‌! రెండోది… డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రెండో విడత నిధులు మంజూరు చేస్తూ మ‌రో సంత‌కం! ‘ఫ‌స్ట్‌ది అయింది. రెండోది కూడా ఫ‌ర్‌ ఫెక్ట్‌ గా అయింది. అంటే, వాస్తు బ‌లం చాలా బాగుంది. వెల‌గ‌పూడి సచివాల‌యం వాస్తు బ‌లంగా ఉంద‌ని చెప్ప‌డానికి ఇదే సాక్ష్యం అని చంద్ర‌బాబు చెప్పారు.

 

దీంతో చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. మ‌రోప‌క్క‌, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వాస్తును న‌మ్ముతున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రానికి ఉన్న ఏకైక పెద్ద స‌చివాల‌యం ఆయ‌న‌కు వాస్తుప‌రంగా న‌చ్చ‌లేద‌ట‌. దీంతో దానిని కూల్చి వేరే చోట కేసీఆర్ జాత‌కానికి త‌గిన విధంగా వాస్తు ప్ర‌కారం కొత్త స‌చివాల‌యం క‌ట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ ర‌క్ర‌మంలో విప‌క్షాల నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను సైతం ఆయ‌న ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. ఇప్పుడు ఏపీ, తెలంగాణ‌ల సీఎంలు వాస్తు అంటూ .. హ‌డావుడి చేస్తుండ‌డం ఆస‌క్తిగా మారింది.