చంద్ర‌బాబు ఎర్త్‌కు బీజేపీ స్కెచ్‌లు

ఏ పొలిటిక‌ల్ పార్టీ అయినా సొంతంగా బ‌లంగా ఎదిగేందుకు ఉన్న అవ‌కాశాల‌ను పూర్తిగా వినియోగించుకుంటూనే ఉంటాయి. ఈ విష‌యంలో జాతీయ‌, ప్రాంతీయ పార్టీలు వేటిక‌వే త‌మ ప్ర‌య‌త్నాల‌ను ముమ్మరం చేయ‌డం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు ఏపీలో బీజేపీ సొంతంగా ఎదిగేందుకు, మ‌రింత బ‌లంగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది. ఇప్ప‌టికే అధికార టీడీపీతో పొత్తు పెట్టుకుని రెండు మంత్రి పీఠాల‌ను సైతం కైవసం చేసుకున్న బీజేపీ రాబోయే రోజుల్లో మాత్రం సొంతంగా ఎద‌గ‌డంపై దృష్టిపెట్టింది.

ఈ క్ర‌మంలోనే అధికార టీడీపీకి ఎర్త్ పెట్టేందుకు సైతం బీజేపీ ఏపీ నేత‌లు రెడీ అయ్యార‌ట‌.  అధికార టీడీపీతో పొత్తు కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించి క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతపై అధిష్టానం పెద్దలు దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఈ నెల 26న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించే రైతు సదస్సుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాని ర‌ప్పిచేందుకు రాష్ట్ర క‌మ‌లం నేత‌లు వ్యూహం సిద్ధం చేశారు.

పెద్దనోట్ల రద్దుపై వస్తున్న విపక్షాల ఆరోపణలకు – ప్రజల్లో నెలకొన్న సందేహాలకు కూడా ఈ సదస్సు ద్వారా గట్టి సమాధానం చెప్పాలని భావిస్తున్నారు.  ఇదిలాఉంటే, వచ్చే ఏడాది జనవరి 3న తిరుపతిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్న‌ట్టు స‌మాచారం.  దీనిద్వారా ఏపీకి ప్ర‌త్యేక ప్యాకేజీ ఎందుకు ఇవ్వాల్సి వ‌చ్చిందో.. హోదా క‌న్నా ప్యాకేజీ ఎందుకు ముద్దో కూడా మోడీ వివ‌రించ‌నున్నారు.

ఈ ఇద్ద‌రు దిగ్గ‌జాలను ఏపీకి ర‌ప్పించ‌డం ద్వారా టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు షాక్ ఇవ్వాలని ఏపీ క‌మ‌ల ద‌ళం భావిస్తోంది. ఇక ఏపీ బీజేపీ నేత‌ల్లో చంద్ర‌బాబు యాంటీ వ‌ర్గం నేత‌లు టీడీపీతో పొత్తు ఉంటే ఇక్క‌డ చంద్ర‌బాబు పార్టీని ఎద‌గ‌నీయ‌ర‌ని అధిష్టానం పెద్ద‌ల ముందు ర‌క‌ర‌కాలుగా ఫిర్యాదులు చేస్తున్నార‌ట‌. ఏపీలో కొంద‌రు బీజేపీ నేత‌లు చంద్ర‌బాబుతో అంట‌కాగుతూ పార్టీని ఎద‌గ‌నీయ‌కుండా చేస్తున్నార‌ని కూడా కొంద‌రు అమిత్ షాకు నూరిపోశార‌ని తెలుస్తోంది. ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏపీపై మ‌రింత ప‌ట్టు సాధించేందుకు బీజేపీ చాప‌కింద నీరులా ప్లాన్లు వేస్తోంది. మ‌రి ఫ్యూచ‌ర్‌లో ఏం జ‌రుగుతుందో చూడాలి.