ఏపీలో చంద్ర‌న్న ఫోన్లు..!

త్వ‌ర‌లోనే ఏపీ ప్ర‌జ‌లంద‌రి(ఫోన్లు లేనివారు) చేతుల్లోనూ చంద్ర‌న్న ఫోన్లు వ‌చ్చేయ‌నున్నాయి. ప్ర‌స్తుతం పెద్ద నోట్ల ర‌ద్దుతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. దీంతో క్యాష్ లెస్ మ‌నీ ట్రాన్సాక్ష‌న్ దిశ‌గా ప్ర‌భుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఈ క్ర‌మంలో దేశంలోని మిగ‌తా రాష్ట్రాల సీఎంక‌న్నా ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రింత వేగంగా ఉన్నారు. పెద్ద నోట్లు ర‌ద్ద‌యిపోవ‌డంతో ప్ర‌జ‌లు ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ల‌కు మ‌ళ్ల‌మ‌ని ఆయ‌న చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్వైపింగ్ యంత్రాల‌ను వినియోగించ‌డం, ప్ర‌జ‌లు వాటికి అల‌వాటు ప‌డ‌డంపైనా ప్ర‌చారం చేయాల‌ని బాబు నిర్ణ‌యించారు. ఇక‌, స్మార్ట్ ఫోన్లు ఉంటే.. ఆ ఫోన్ల ద్వారానే మ‌నీ ట్రాన్సాక్ష‌న్ చేయాల‌ని బాబు పిలుపునిచ్చారు. అయితే, మొబైళ్లు లేని పేద‌ల మాటేమిట‌నే ప్ర‌శ్న‌రావ‌డంతో.. చంద్ర‌బాబు ఆ ఫోన్ల‌ను ప్ర‌జ‌లకు ఫ్రీగా ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారు. పెద్దనోట్ల రద్దు అనంతర పరిణామాలపై  విజయవాడలో బ్యాంకర్లు, ఆర్బీఐ అధికారులతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈనెల 28, 29వ తేదీ వరకు రాష్ట్రానికి మరో మూడు వేల కోట్ల కరెన్సీ రానుందని.. వీటిలో 60 కోట్ల రూపాయలు చిన్న నోట్లు ఉంటాయని ఆర్బీఐ అధికారులు చెప్పారు. ఈ సంద‌ర్భంగా బాబు హ‌ర్షం వ్య‌క్తం చేయ‌డంతోపాటు మ‌రింత‌గా చిన్న‌నోట్ల ముద్ర ఉండాల‌ని సూచించ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికైతే.. రానున్న కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలో ప‌రిస్థితి అదుపులోకి వ‌స్తుంద‌ని తెలుస్తోంది. మ‌రి చంద్ర‌బాబు ఫ్రీ ఫోన్ల ఆఫ‌ర్ ఎంత‌మందికి చేరుతుందో చూడాలి. అయితే, ఇక్క‌డే పెద్ద స‌మస్య కూడా నెల‌కొంది. రాష్ట్రంలో పేద‌లు దాదాపు నిర‌క్ష‌రాస్య‌త రేఖ ప‌రిధిలోనే ఉన్నారు. మ‌రి వీళ్లు ఆ ఫోన్ల‌ను వినియోగించుకుంటారా?  లేదా? అనేది చూడాలి.