ఏపీలో మ‌ల్టీఫ్లెక్స్ వ‌ర్సెస్ డిస్ట్రిబ్యూట‌ర్స్ ఫైట్

ఏపీలో మ‌ల్టీప్టెక్స్ సినిమా హాళ్ల యాజ‌మాన్యాలు, మూవీ డిస్ట్రి బ్యూట‌ర్ల‌కు మ‌ధ్య ఫైట్ జోరందుకుంది! మూవీల‌కు సంబంధించిన కెల‌క్ష‌న్ విష‌యంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య త‌లెత్తిన వివాదం మ‌రింత పెరిగింది. విశాఖ‌, కృష్ణా, గుంటూరు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో భారీ ఎత్తున మ‌ల్టీప్లెక్స్ లు ఉన్నాయి. అయితే, మూవీ విడుద‌లైన త‌ర్వాత వ‌చ్చే క‌లెక్ష‌న్ల‌లో యాజ‌మాన్యాలు, డిస్ట్రిబ్యూట‌ర్లు వాటాలు పంచుకుంటారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌రకు 50% మేర క‌లెక్ష‌న్ల‌ను ఇరువురూ పంచుకుంటున్నారు. అయితే, త‌మ‌కు 60% మేర‌కు ఇవ్వాల‌ని డిస్ట్రిబ్యూట‌ర్లు ప‌ట్టుబ‌డుతున్నారు. ఈ వివాదం గ‌త కొన్నాళ్ల నుంచి ఉంది.

అయితే, దీనిపై ఎలాంటి ప‌రిష్కారానికీ య‌జ‌మానులు ముందుకు రావ‌డం లేదు. దీంతో వివాదం మ‌రింత పెరిగి.. మూవీలు ఆపేసే వ‌ర‌కు వ‌చ్చింది. వాస్త‌వానికి ప్ర‌స్తుతం ఉన్న విధానం ప్ర‌కారం.. మల్టీప్లెక్స్‌ల్లో 50కి పైగా స్క్రీన్లు ఉన్నాయి. వాటిలో సినిమాల ప్రదర్శన వల్ల రోజుకు దాదాపు రూ.కోటి కలెక్షన్‌ వస్తోందని అంచనా. డిస్ట్రిబ్యూటర్లకు మొదటివారం కలెక్షన్లలో 50 శాతం.. అంటే రోజుకు రూ.50 లక్షలు ఇస్తున్నారు. మొదటివారం 50 శాతం: 50 శాతం, రెండోవారం 55:45, మూడోవారం 60:40, నాలుగోవారం 65 శాతం: 35 శాతం చొప్పున కలెక్షన్లు పంపిణీ చేస్తున్నారు. అయితే, ఇక్క‌డ యాజ‌మాన్యాలు ఓ ట్రిక్ ప్లే చేస్తున్నార‌ని  డిస్ట్రిబ్యూట‌ర్లు అంటున్నారు.

 రెండో వారం మూడోవారం నుంచి త‌మ క‌లెక్ష‌న్లు పెరిగే స‌మ‌యానికి య‌జ‌మానులు మూవీల‌ను ఎత్తేస్తున్నార‌ని దీనివ‌ల్ల త‌మ‌కు ఎలాంటి లాభం ఉండ‌డం లేద‌ని చెబుతున్నారు. మల్టీప్లెక్స్‌ల్లో తమకు ఎక్కువ వాటా వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో సినిమాలే ప్రదర్శించడం లేదని డిస్ట్రిబ్యూటర్లు ఆరోపిస్తున్నారు.దీంతో మొదటివారం కలెక్షన్లలో కనీసం 53 శాతం అయినా ఇప్పించాలని కోరుతున్నారు. అయితే, యాజ‌మాన్యాలు మాత్రం దీనిపై స్పందించ‌డం లేదు. పోనీ ఇలా కాక‌పోయినా.. తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్న తాజా విధానం ప్ర‌కారం.. మొదటివారం 55 శాతం: 45 శాతం, రెండోవారం 60:40, మూడు, నాలుగు వారాలు  65శాతం: 35శాతంగా కలెక్షన్లు పంచాల‌ని డిస్ట్రి బ్యూట‌ర్లు కోరుతున్నారు.

అయితే, దీనిపైనా ప్ర‌తిష్టంభ‌న కొన‌సాగుతోంది. దీంతో ప్ర‌స్తుతం మ‌ల్టీఫ్లెక్స్‌ల‌లో సినిమాల ప్ర‌ద‌ర్శ‌న‌లు నిలిచిపోయాయి. ఇక‌, ఈ విష‌యంపై మాట్లాడిన ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ న‌ట్టి కుమార్‌.. ‘‘మల్టీప్లెక్స్‌లు సినిమాల ప్రదర్శనతోపాటు ఇతర వ్యాపారాలతో కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాయి. సినిమా కలెక్షన్లలో డిస్ట్రిబ్యూటర్లకు 60 శాతం ఇచ్చిన తక్కువే అవుతుంది. ప్రభుత్వ పెద్దలు మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలకు కొమ్ముకాయడం దారుణం’’అన్నారు. మ‌రి ఈ విష‌యం ఎప్ప‌టికి ప‌రిష్కారం అవుతుందో చూడాలి.