త‌మ్ముళ్ల‌కు చంద్ర‌బాబు ఆఫ‌ర్ – వార్నింగ్‌

క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన కార్య‌క‌ర్త‌లున్న పార్టీగా  తెలుగుదేశం పార్టీకి దేశంలోనే ప్ర‌త్యేక స్థాన‌ముంది. పార్టీ కోసం అహ‌ర్నిశ‌లు సైనికుల్లా శ్ర‌మించే వీరి అండదండ‌ల‌తోనే ఆ పార్టీ గ‌త ముప్పై మూడేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులెదురైనా వాటిని స‌మ‌ర్థంగా ఎదుర్కొంటూ ముందుకు రాగ‌లిగింది.  తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ధాన రాజ‌కీయ‌ప‌క్షంగా సుస్థిర స్థానం సంపాదించుకోగ‌లిగింది. ఈ నేప‌థ్యంలో పార్టీనే నమ్ముకుని సొంత ఆస్తుల‌ను కూడా క‌రిగించుకుంటూ పనిచేసిన కార్యకర్తలను, నాయ‌కుల‌ను ఆదుకునేందుకు  ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్న‌ట్టు.. ఆ పార్టీ అధినేత – ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్ల‌డించారు.  కార్యకర్తలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా అవసరమైతే వారికి రుణసౌకర్యాన్ని కల్పిస్తామని  చంద్ర‌బాబు తెలిపారు.

అయితే పార్టీ ప్ర‌తిష్ఠ‌ను పెంచేలా, క్ర‌మశిక్షణ గల కార్యకర్తలుగా తెలుగుదేశం శ్రేణులు వ్యవహరించాలని చంద్ర‌బాబు సూచించారు. పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల‌ని, అవినీతి ముద్ర ప‌డిన వారిని, పార్టీకి చెడ్డ‌పేరు తీసుకువ‌చ్చేలా వ్య‌వ‌హరించే వారిని మాత్రం వారెవ‌రైనా.. ఏ స్థాయి వ్య‌క్తులైనా పార్టీ దూరంగా పెడుతుంద‌ని  చంద్రబాబు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎ1 కన్వెన్షన్ హాల్ లో తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తలతో జరిగిన సమావేశంలో చంద్ర‌బాబు మాట్లాడారు.

ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులున్నా… వాటిని అధిగ‌మిస్తూ..  దేశంలో ఎవ‌రికీ సాధ్యంకారి రీతిలో  రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామని, అయితే వీటి ఫ‌లితాల‌ను పేద‌ ప్రజలకు చేరవేయ‌గ‌లిగిన‌ప్పుడు పార్టీ ల‌క్ష్యం నెర‌వేరిన‌ట్ట‌ని, ఈ బాధ్యత ప్ర‌ధానంగా పార్టీ కార్యకర్తలదేనని  చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.  త్వ‌ర‌లోనే రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు, నామినేటెడ్‌ పదవులు భర్తీ చేస్తామని పార్టీ కోసం నిజంగా శ్ర‌మించిన కార్య‌క‌ర్త‌ల‌కు ఈ ప‌ద‌వుల్లో పెద్ద పీట వేస్తామ‌ని టీడీపీ అధినేత వెల్ల‌డించారు. ప్రస్తుతం రాష్ట్రంలో  ఉన్న‌ 175 అసెంబ్లి నియోజకవర్గాలను 225 నియోజకవర్గాలుగా విభ‌జించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న‌ట్టు కూడా చంద్ర‌బాబు తెలిపారు.