ఆ ఏపీ మంత్రి నియోజ‌క‌వ‌ర్గంలో కులాల చిచ్చు

సామాజిక వ‌ర్గాల ఆధిప‌త్యానికి ఇప్పుడు మంత్రి రావెల కిశోర్ బాబు నియోజ‌క‌వ‌ర్గం కేరాఫ్‌గా మారిందా? అక్క‌డ రావెల సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు సొంత పార్టీలోని ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌నే టార్గెట్ చేస్తున్నాయా? ఈ క్ర‌మంలో మిగిలిన సామాజిక వ‌ర్గాల నేతలంగా ఇప్పుడు రావెల‌కు యాంటీగా మార‌బోతున్నారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలో!! ఇక‌, విష‌యంలోకి వెళ్లిపోతే.. ఐఆర్‌టీఎస్ అధికారిగా ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన రావెల కిశోర్‌బాబు 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ అభ్య‌ర్థిగా హ‌ఠాత్తుగా తెర‌మీద‌కి వ‌చ్చారు.

ప్ర‌త్తిపాడు రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం, రావెల సామాజిక వ‌ర్గం అక్క‌డ ఎక్కువ ఉండ‌డంతో ఆయ‌న గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని భావించిన చంద్ర‌బాబు ఆయ‌న‌కు టికెట్ ఇచ్చి అక్క‌డి నుంచి బ‌రిలో దింపారు. దీంతో రావెల ఎమ్మెల్యేగా గెలుపొంద‌డ‌మే కాకుండా రాష్ట్ర కేబినెట్‌లో సీటుకూడా కొట్టేశారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. రావెల నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న సామాజిక వ‌ర్గ‌మే కాకుండా అనేక సామాజిక వ‌ర్గాలు ఉన్నాయి. వీరంతా మొద‌టి నుంచి టీడీపీకి అనుకూలంగా ఉన్న‌వారే. దీంతో టీడీపీ సానుభూతి ప‌రుల ఓట్ల‌న్నీ రావెల‌కు ప్ల‌స్స‌య్యాయి.

అయితే, ఇప్పుడు రావెల సామాజిక వ‌ర్గానికి చెందిన టీడీపీ నేత‌లు, స్థానిక సంస్థ‌ల నేత‌లు, అధికారులు, నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నేత‌లు అంతా ఒక్క‌టైపోయి.. మిగిలిన సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారిని తీవ్రంగా అవ‌మానిస్తున్నార‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అదికూడా టీడీపీకి సానుభూతి ప‌రులుగా ఉన్న ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌ను కూడా ప‌ట్టించుకోకుండా రావెల వ‌ర్గం ప‌క్క‌న‌పెడుతోంద‌ట‌. దీంతో వాళ్లంతా ఈ సామాజిక వ‌ర్గాల ఘ‌ర్ష‌ణ‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారంట‌. ‘రావెల కిషోర్‌’ను ఎమ్మెల్యేగా గెలిపించడం వెనుక ఏయే…ఏయే సామాజికవర్గాల ఓటర్ల ప్రభావం ఉందో ఆయనకు తెలియదా? ఏయే గ్రామాల్లో ఎంతెంత మెజార్టీ వచ్చిందో తెలిసినా కులతత్వంతో నియంతృత్వ పోకడ‌ల‌తో ఓటర్ల మనోభావాలను దెబ్బతీశారని, స్థానిక టీడీపీ సీనియర్‌ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  ఇదే విష‌యాన్ని జిల్లాలోని మంరో మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు, హోం మంత్రి రాజ‌ప్ప‌ల దృష్టికి తీసుకెళ్లార‌ని స‌మాచారం. అయితే, వీళ్లు కూడా రావెల సామాజిక వ‌ర్గాన్ని హెచ్చ‌రించ‌క‌పోగా విష‌యాన్ని మ‌ళ్లీ రావెల కోర్టులోకే నెట్టార‌ట‌. దీంతో ఇప్పుడు ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలో సామాజిక‌వ‌ర్గాల ఆందోళ‌న పెద్ద స్థాయిలో జ‌రుగుతోంది. త‌మ సామాజిక వ‌ర్గం కానివారిపై పెత్త‌నం చేస్తున్నార‌ని రావెల వ‌ర్గంపై విరుచుకుప‌డుతున్నారు. సాక్షాత్తూ సీఎం చంద్ర‌బాబును సైతం వీరు దూషిస్తున్నార‌ని అంటున్నారు.

ఇక‌, త‌మ గోడును చంద్ర‌బాబుకే చెప్పుకునేందుకు వీరంతా సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే త‌న కుమారుల‌తో ఇబ్బందులు ప‌డుతున్న రావెల‌కి ఇప్పుడు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో సొంత సామాజిక వ‌ర్గం నుంచే పెద్ద ఎత్తున త‌ల‌నొప్పులు ఎదురుకావ‌డం మ‌రింత ఇబ్బందిగా ప‌రిణ‌మించింది.