సీఎంకు మారుత‌ల్లి చేత‌బ‌డి చేయించిందా?

ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ మూవీల్లో రాజ‌కీయ పీఠాల కోసం మారు త‌ల్లులు విష ప్రయోగం చేయ‌డం, మందు మాకులు పెట్ట‌డం, మంత్ర గాళ్ల‌ను ఆశ్ర‌యించ‌డం వంటివి చూశాం. ఇప్పుడు ఈ సీన్ యూపీలో రిపీట్ అయింద‌ని అంటున్నారు అక్క‌డి సీఎం అఖిలేష్ వ‌ర్గానికి చెందిన నేత‌లు. త‌మ నేత, యూపీ సీఎం అఖిలేష్ పై క‌త్తిక‌ట్టిన మారుత‌ల్లి, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాద‌వ్ రెండో భార్య అఖిలేష్‌పై చేత‌బ‌డి చేయింద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు ఈ విష‌యం పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కుటంబ క‌ల‌హాల‌తో అట్టుడికిపోయిన యూపీ అధికార పార్టీలో ఇప్పుడు ఈ ఉదంతం ప‌రాకాష్ట‌కు చేరింద‌నే టాక్ వ‌స్తోంది.

సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా యాదవ్. మొద‌టి భార్య 2003లో చ‌నిపోయారు. అయితే, ఈమె ఉండ‌గానే.. పార్టీలో కార్య‌క‌ర్త‌గా చేరిన సాధ‌న ములాయంకి ద‌గ్గర‌య్యారు. ఆ త‌ర్వాత వీరి బంధం పెళ్లికి దారితీసింది. ములాయం, సాధ‌న‌లు ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే, పొలిటిక‌ల్ ప్రెజ‌ర్ నేప‌థ్యంలో ములాయం ఈ విష‌యాన్ని 2007లో బ‌య‌ట‌పెట్టారు. అప్ప‌టి నుంచి ఆమె కూడా పార్టీలో కీల‌కంగానే ఉంటున్నారు. ఇదిలావుంటే, వ‌చ్చే ఏడాది మొద‌ట్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో సీఎం అఖిలేష్‌.. ఆయ‌న బాబాయి శివ‌పాల్ యాద‌వ్‌ల మధ్య విభేదాలు త‌లెత్తి.. పెద్ద ఎత్తున కొన‌సాగాయి.

ఈ క్ర‌మంలో  ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న అంతర్గత సంక్షోభంలో సాధన తన భర్త ములాయం వర్గానికి అనుకూలంగా, మారు కొడుకు అఖిలేఖ్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై అఖిలేష్ వ‌ర్గం గుర్రుగా ఉంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు తాజాగా అఖిలేష్ వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఉదయ్ వీర్ సింగ్ చేత‌బ‌డి బాంబు పేల్చారు. ‘సవతి కొడుకు ఎదుగుదలను చూడలేని ఆ మారుతల్లి మా ముఖ్యమంత్రికి చేతబడి చేయించింది’ అని  ఆయ‌న పెద్ద ఓ రేంజ్‌లో ఆరోపిస్తూ.. ఏకంగా ఎస్పీ అధినేత‌, నేతాజీ ములాయంకే లేఖ‌రాశారు. అయితే, అత్యంత ర‌హ‌స్యంగా రాశాన‌ని ఉద‌య్ చెబుతున్నా.. ఈ విష‌యం మాత్రం మీడియాకు పొక్కింది.

దీంతో.. ఉద‌య్ లేఖ‌పై ములాయం, శివ‌పాల్ వ‌ర్గాలు తీవ్రంగ మండిప‌డుతున్నాయి. రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని అఖిలేష్ వ‌ర్గం ప్లే చేస్తున్న పొలిటిక‌ల్ గేమ్‌గా పేర్కొంటున్నాయి.   ‘ఇలాంటి లేఖలు కనీసం 500 ఓట్లను కూడా రాలవని, ఇంకోసారి నేతాజీ(ములాయం)ని తప్పుకోవాలనంటే తాట తీస్తామ’ని అఖిలేష్ వర్గాన్ని హెచ్చరించారు. మ‌రి ఈ లేఖ‌, చేత‌బ‌డి ఆరోప‌ణ‌ల‌పై నేతాజీ ఎలా స్పందిస్తారో అనేది వేచి చూడాలి. ఏదేమైనా.. యూపీ అధికార పార్టీలో ముదిరిన రాజ‌కీయ ర‌గ‌డ‌కు తాజా ఆరోప‌ణ‌లు ప‌రాకాష్ట‌గా మారాయ‌ని పొలిటిక‌ల్ పండితులు చెబుతున్నారు.