వైకాపాలో గ్రూపుల గోల‌

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైకాపా నిర్ణ‌యాత్మ‌క పాత్ర పోషించ‌లేక పోతోందా?  వైకాపా నేత‌లు త‌మ‌లో తామే గొడ‌వ‌లు ప‌డుతూ పార్టీ ప‌రువును బ‌జారుకు ఈడుస్తున్నారా?  ఆధిప‌త్య ధోర‌ణి పెరిగిపోతోందా?  వీరిని లైన్‌లో పెట్టాల్సిన వైకాపా అధినేత జ‌గ‌న్‌.. మౌనం పాటిస్తున్నారా?  వైకాపాను న‌డిపించ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నారా? అంటే ఔన‌నే అంటున్నారు అనంత‌పురం వైకాపా నేత‌లు! ఈ జిల్లాలో వైకాపాకు సంఖ్యా బ‌లం ఎక్కువ‌గానే ఉంది. అయితే, ఎవ‌రికి వారిలో ఆధిప‌త్య ధోర‌ణి పెరిగిపోవ‌డంతో నిత్యం ఏదో ఒక గొడ‌వ తెర‌మీద‌కి వ‌స్తోంది. అంతేకాదు, ఒక‌రిపై ఒక‌రు నేరుగా అధినేత జ‌గ‌న్‌కే ఫిర్యాదులు చేసుకుంటున్నారు ఇక్క‌డి నేత‌లు. ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రు హైద‌రాబాద్‌లోని లోట‌స్ పాండ్‌కు వ‌చ్చి అధినేత‌ను క‌లిసి ఫిర్యాదులు చేస్తున్నారు.

దీంతో ఈ విష‌యంలో ఎలా స్పందిస్తే ఏమ‌వుతుందోన‌ని జంకుతున్న జ‌గ‌న్‌.. ఎవ‌రు ఏం చెప్పినా వింటూ.. త‌లాడిస్తున్నార‌ట‌. అంతేకానీ, ఎవ‌రినీ స‌ముదాయించే ప్రయ‌త్నం కానీ, ఎవ‌రినీ హెచ్చ‌రించే ప్ర‌య‌త్నం కానీ చేయ‌డం లేదట‌. ఇటీవ‌ల రైతుల ప‌క్షాన వైకాపా అధినేత జ‌గ‌నే అనంత‌పురం క‌లెక్టరేట్ వ‌ద్ద భారీ ఎత్తున ధ‌ర్నాకు దిగారు. ప్ర‌భుత్వం రైతుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, రైతులు అన్యాయం అయిపోతున్నార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయితే, ఇదే స‌భ‌లో అనంత వైకాపా నేత‌లు త‌మ‌తమ ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు రెడీ అయిపోయారు. అధినేత స‌భ‌లో ఉన్నాడ‌న్న విష‌యం కూడా మ‌రిచిపోయి.. ఆయ‌న దృష్టిలో ప‌డేందుకు ఒక‌రిపై ఒక‌రు కుమ్మేసుకోవ‌డం కూడా క‌నిపించింది.

పార్టీకి చెందిన నాయకులు ఎవరికి వారుగా బలప్రదర్శనకు దిగారు. ఇది చివ‌ర‌కు అధినేత ఆగ్ర‌హానికి గుర‌య్యేలా చేసింది.  నేతలు సహకరించకపోతే వేదిక దిగి వెళ్లిపోతానని జగన్‌ హెచ్చరించే వరకు వెళ్లింది.. జిల్లాలో నెలకొన్ని గ్రూపు విభేదాల నేపథ్యంలో తమకే ఎక్కువ ఇంపార్టెన్స్‌ దక్కాలని నేతలు అనుకున్నారు. దీంతో అంద‌రూ దండ‌లు ప‌ట్టుకుని డ‌యాస్ మీద‌కి ఎక్కేస‌రికి ప‌రిస్థితి అదుపుత‌ప్పింది. ఇక‌, జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న గ‌డ‌ప గ‌డ‌ప వైకాపా కార్య‌క్ర‌మానికి కూడా అనంత నేత‌లు ఒక్క‌రూ స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌చందంగా వైకాపా నేత‌లు వ్య‌వ‌హ‌రించార‌ట‌. ఇక‌, ఇప్ప‌టి నుంచి ఎన్నిక‌ల్లో టికెట్ట‌ను ఆశిస్తున్న వారి హంగామా అయితే చెప్ప‌న‌ల‌వి కాకుండా ఉంద‌ని స‌మాచారం.

 దీంతో అనంత‌పురం వైకాపాలో నేత‌ల మ‌ధ్య స‌యోధ్య క‌న్నా యుద్ధ‌మే ఎక్కువ‌గా జ‌రుగుతోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.  ప్రతి ఒక్కరికి టికెట్‌ ఆశ కల్పించడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నది ప్ర‌ధాన విమ‌ర్శ‌గా క‌నిపిస్తోంది. మ‌రి రానున్న 2019 ఎన్నిక‌ల నాటికి ఇదే ప‌రిస్థితి ఉంటే.. వైకాపా పూర్తిగా న‌ష్ట‌పోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. మ‌రి అధినేత ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి. కానీ, ఇక్క‌డి నేత‌ల‌ను ఏమ‌న్నా.. ఇబ్బందేన‌ని మ‌రో టాక్ న‌డుస్తోంది. అందుకే జ‌గ‌న్ మౌనంగా ఉన్నార‌ని చెబుతున్నారు. మ‌రి భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో చూడాలి.