జ‌య రిటైర్డ్‌..!

అవును! మీరు చ‌దివింది నిజ‌మే! త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత‌, త‌మిళ ప్ర‌జ‌ల అమ్మ రిటైర్డ్ అయ్యారు. ఆమెను విధుల నుంచి పూర్తిగా రిలీవ్ చేస్తున్న‌ట్టు ప్ర‌త్య‌క్షంగా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర‌రావు ప్ర‌క‌టించ‌క పోయిన‌ప్ప‌టికీ.. ఆమె చూస్తున్న అన్ని శాఖ‌ల‌నూ ఆర్థిక మంత్రి ప‌న్నీర్ సెల్వానికి ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జ‌య ఒక‌రకంగా త‌న విధుల నుంచి రిటైర్డ్ అయిన‌ట్టే క‌దా!! అయితే, ఆమె సీఎంగా మాత్రం కొన‌సాగుతారు. పురుచ్చితలైవిగా పూజ‌లందుకునే ఒక‌ప్ప‌టి సినీ హీరోయిన్ జ‌య‌ల‌లిత ఈ ఏడాది ప్రారంభంలో జ‌రిగిన త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో చ‌రిత్ర సృష్టించారు. వాస్త‌వానికి త‌మిళ‌నాడులో క‌న్నేళ్లుగా వ‌స్తున్న సంప్ర‌దాయం ప్ర‌కారం ఐదేళ్ల‌కు ఒక‌సారి నాయ‌క‌త్వాన్ని అక్క‌డి ప్ర‌జ‌లు త‌మ ఓటుతో మారుస్తున్నారు. అయితే, ఈ సంప్ర‌దాయాన్ని తోసిపుచ్చి ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో మ‌రోసారి జ‌య‌కి ప‌ట్టంక‌ట్టారు.

దీంతో రెండోసారి సీఎంగా జ‌య ప్ర‌మాణం చేశారు. అయితే, గ‌త నెల రెండో వారం వ‌ర‌కు బాగానే పాల‌న సాగించిన జ‌య.. ఒక్క‌సారిగా అనారోగ్యానికి గుర‌య్యారు. తీవ్ర జ్వ‌రం, గొంతు ఇన్‌ఫెక్ష‌న్‌తో చెన్నైలోని అపోలో ఆస్ప‌త్రిలో చేరారు. అయితే, ఒక‌టి రెండు రోజుల్లోనే ఆమె డిశ్చార్జ్ అవుతార‌ని భావించినప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 20 రోజుల‌కు పైగా ఆమె ఆస్ప‌త్రి బెడ్‌కే ప‌రిమితం అయిపోవాల్సి వ‌చ్చింది. ఇంత‌లో జ‌య ఆరోగ్యానికి సంబంధించిన వ‌దంతులు కూడా పెద్ద ఎత్తున షికారు చేశాయి. ఈ క్ర‌మంలో స్పందించిన విప‌క్ష డీఎంకే సాధ‌రి క‌రుణానిధి జ‌య ఆరోగ్యంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాన్ని కోర‌డం, మ‌రో వ్య‌క్తి మ‌ద్రాస్ హైకోర్టులో పిల్ దాఖ‌లు చేయ‌డంతో ఎట్ట‌కేల‌కు అపోలో వైద్యులు ద‌ఫ ద‌ఫాలుగా జ‌య ఆరోగ్యంపై  బులిటెన్లు విడుద‌ల చేస్తూ వ‌చ్చారు.

అయితే, ఆమె ఆరోగ్యం కోలుకుంటోంద‌ని, వైద్యానికి స్పందిస్తున్నార‌ని మాత్రమే వెల్ల‌డిస్తున్నారు త‌ప్ప ఇంకేమీ వివ‌రంగా చెప్ప‌డంలేదు. మ‌రోప‌క్క‌, ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాలు నిలిచిపోయాయి. దీంతో సీఎం పీఠం అధిరోహించేందుకు త‌మిళ‌నాడు పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టేందుకు గ‌తంలో తాత్కాలిక సీఎంగా చేసిన ప‌న్నీర్ సెల్వం స‌హా జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ‌, మ‌రో మంత్రి ప‌ళ‌నిస్వామి లు పోటీ ప‌డ్డారు. ఇంత‌లో అమ్మ వీలునామా అంటూ మ‌రో విష‌యం తెర‌మీద‌కి వ‌చ్చింది. సినీ న‌టుడు అజిత్ త‌న‌కు రాజ‌కీయ వార‌సుడంటూ అమ్మ ప్ర‌క‌టించార‌ని ప్ర‌చారం జ‌రిగింది. మ‌రోప‌క్క‌, జ‌య‌ను ప‌రామ‌ర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌, కేంద్ర మంత్రి వెంక‌య్య‌లు వ‌రుస‌గా చెన్నై వ‌చ్చారు.

అయితే, జ‌య‌ను ఉంచిన గ‌దిలోకి ఎవ‌రినీ అనుమ‌తించ‌లేదు. కేవ‌లం అద్దాల గ‌ది నుంచి మాత్ర‌మే వారికి అనుమ‌తించారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు నేతలూ జ‌య కోలుకుంటున్నట్టు ప్ర‌క‌టించారు. వెంక‌య్య అయితే, జ‌యం పీఠం కోసం ఎవ‌రూ వాద‌న చేసుకోవ‌ద్ద‌ని, ఆమె కోలుకుంటున్నార‌ని, త్వ‌ర‌లోనే బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌ని చెప్పారు. ఇక‌, ఇప్పుడు తాజాగా గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర‌రావు జ‌య చూస్తున్న అన్ని శాఖ‌ల బాధ్య‌త‌ల‌ను ఆర్థిక మంత్రిగా ఉన్న ప‌న్నీర్ సెల్వంకి అప్ప‌గిస్తూ.. ఉత్త‌ర్వులు జారీ చేశారు. అయితే, సీఎంగా మాత్రం జ‌య పేరు కొన‌సాగుతుంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా.. త‌మిళ‌నాట అమ్మ ఆరోగ్యంపై నెల‌కొన్న ప్ర‌తిష్టంభ‌న మాత్రం కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.