బాబు కేబినెట్‌లో ఏ గ్రేడ్ మంత్రులు వీళ్లే

ఏపీ సీఎం చంద్ర‌బాబు కేబినెట్‌లోని ముగ్గురు మంత్రులు ఎగిరి గంతేస్తున్నారు. ప‌ట్ట‌రాని ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బై సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇక‌, త‌మ‌కు తిరుగులేద‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు! ఎందుకంటారా? ఇటీవ‌ల టీడీపీ అధ‌నేత‌ చంద్ర‌బాబు చేయించిన స‌ర్వేలో ఈ ముగ్గురికీ ఏగ్రేడ్ రావ‌డ‌మే కార‌ణ‌మ‌ని రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల చంద్ర‌బాబు త‌న పార్టీ ఎమ్మెల్యేలు స‌హా త‌న కేబినెట్ మంత్రుల ప‌నితీరుపై స‌ర్వే చేయించారు. వారి ప‌నితీరు, స్థానిక ప్ర‌జ‌ల‌తో ఇంట‌రాక్ష‌న్ అవుతున్న తీరు, స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తున్న విధానం, అవినీతి, దందాలు, బంధుప్రీతి వంటి ప‌లు అంశాల్లో ఆయా నేత‌ల‌పై అంత‌ర్గ‌తంగా స‌ర్వే చేయించారు. వీటిలో వ‌చ్చిన ఫ‌లితాల‌ను బ‌ట్టి  మంత్రులకు గ్రేడ్‌లు కూడా కేటాయించారు.

ఈగ్రేడ్‌లే వారి ప‌నితీరుకు కొల‌మాన‌మ‌ని, వారి భ‌విష్య‌త్తును ఇవే నిర్దేశిస్తాయ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల విజ‌య‌వాడలోని కేఎల్ యూనివ‌ర్సిటీలో జ‌రిగిన పార్టీ శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో ఈ గ్రేడులు, ఆయా ఎమ్మెల్యేల ప‌నితీరు, మంత్రుల ప‌నితీరు వారికి కేటాయించిన గ్రేడ్‌ల‌ను ఓ సీల్డ్ క‌వ‌ర్‌లో పెట్టి మ‌రీ అందించారు. అంతేకాదు, ఆయా గ్రేడ్‌ల‌ను బ‌య‌ట‌కు చెప్ప‌రాద‌ని , ముఖ్యంగా మీడియాకు తెలీకూడ‌ద‌ని కూడా చంద్ర‌బాబు హెచ్చ‌రించిన‌ట్టు తెలిసింది. అయితే,ఆ నోటా .. ఈనోటా కొంద‌రికి కేటాయించిన గ్రేడ్‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇప్ప‌డు ఈ క్ర‌మంలోనే కేబినెట్‌లో ప్ర‌ధాన శాఖ‌లైన హోం, జ‌ల‌వ‌న‌రులు, మునిసిప‌ల్ శాఖ‌ల మంత్రులుగా ఉన్న చిన‌రాజ‌ప్ప‌, దేవినేని ఉమా, నారాయ‌ణ‌ల‌కు చెందిన గ్రేడ్ ఏ అని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ ముగ్గురి ప‌నితీరు విష‌యంలో చంద్ర‌బాబు పూర్తి సంతృప్తిగా ఉన్నార‌ని, వీరు ముగ్గురూ అవినీతికి దూరంగా ఉండ‌డ మేకాకుండా ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా కూడా ఉంటున్నార‌ని స‌ర్వేలో స్ప‌ష్ట‌మైంద‌ట‌. ఇక‌, ముఖ్యంగా బంధు వ‌ర్గాన్ని ఈ ముగ్గురూ క‌నీసం ఛాయ‌ల‌కు కూడా రానివ్వడం లేద‌ట‌. తమ శాఖలలో జరిగిన అధికారులు, ఉద్యోగుల బదిలీలు,పోస్టింగ్‌ల్లో ఎటువంటి అవినీతి తమకు అంటకుండా ఈ ముగ్గురు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని కూడా చంద్ర‌బాబు గుర్తించార‌ట‌. అంతే కాకుండా మంత్రులు రాజప్ప, ఉమామహేశ్వరరావులు తమ సొంత నియోజకవర్గాల్లో కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండడమే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారంలో చాలా మందికన్నా ముందున్నారని ఆ నివేదికలో వెల్లడైంది.

ముఖ్యంగా హోంమంత్రి చినరాజప్పకు ఈ ఇద్దరికన్నా ఎక్కువగా ఆ నివేదికలో ప్రశంసలు దక్కాయట. అయితే, పంటి కింద రాయిలా మంత్రి నారాయ‌ణ అంద‌రిలో నూ క‌లివిడిగా ఉండ‌లేక‌పోతున్నార‌ని స‌ర్వేలో తేలింద‌ట‌. ఇక‌, ఉమా విష‌యానికి వ‌స్తే.. స్థానికంగా సిఫార్సుల‌తో ఆయ‌న ఉక్కిరి బిక్కిరి అవుతున్నార‌ని స‌ర్వేలో తేలింద‌ట‌. దీంతో ఈ ఇద్ద‌రిక‌న్నా మంత్రి రాజ‌ప్ప‌కి ఎక్కువ ప్ల‌స్‌లు ప‌డ్డాయ‌ని స‌మాచారం. అయితే, ముగ్గురి విష‌యంలో చంద్ర‌బాబు రిలాక్స్‌గా ఫీల‌య్యార‌ని అందుకే ఏ గ్రేడ్ ఇచ్చార‌ని తెలిసింది. మొత్తానికి చంద్ర‌బాబు కేబినెట్‌లో ఏగ్రేడ్ అంటే మాట‌లా? అని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.