టీడీపీ ఎంపీపై బాబుకు ఎంత ప్రేమ‌

టీడీపీకి చెందిన ఓ ఎంపీపై సీఎం చంద్ర‌బాబు ప్రేమ కురిపిస్తున్నారా?  నిబంధ‌న‌ల‌ను సైతం ప‌క్క‌కు పెట్టి మ‌రీ ఆ ఎంపీని ఆద‌రిస్తున్నారా? అంటే ఔన‌నే ఆన్స‌రే చెబుతున్నారు తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న‌వారు. రాష్ట్ర అభివృద్ధి విష‌యంలో రాజీ ప‌డేది లేద‌ని, ఎంత‌కైనా వెనుకాడేది లేద‌ని ప‌దే ప‌దే చెప్పే చంద్ర‌బాబు.. ఓ విష‌యంలో మాత్రం పూర్తి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా కాంట్రాక్టుల విష‌యంలో ఆయా ప‌నుల‌ను నిర్దేశిత గ‌డువు లోగా పూర్తి చేయ‌ని కాంట్రాక్ట‌ర్ల‌ను, ఆయా సంస్థ‌ల‌ను బ్లాక్ లిస్టులో పెట్టాల‌నే చంద్ర‌బాబు… ఓ కాంట్రాక్టు సంస్థ‌పై ఎన్ని ఆరోప‌ణ‌లు వ‌చ్చినా లైట్‌గా తీసుకుంటున్నార‌ట‌. అంతేకాదు, ఏకంగా ప్ర‌పంచ బ్యాంకే నేరుగా ఆ కాంట్రాక్టు సంస్థ‌ను ప‌నుల నుంచి త‌ప్పించాల‌ని సూచించినా.. కూడా చ‌ర్య‌లు తీసుకోక‌పోగా.. ప్ర‌పంచ బ్యాంక్‌తో ఉన్న డీల్‌నే ర‌ద్దు చేసుకునేందుకు సీఎం సిద్ధ‌ప‌డ్డార‌ని స‌మాచారం. మ‌రి అంత‌గా ఆ కాంట్రాక్టు సంస్థ‌పై చంద్ర‌బాబుకు ప్రేమ ఎందుకు?  దానిని ఎందుకు కొన‌సాగిస్తున్నారు? అనేగా మీ సందేహాలు.. అయితే, ఇది చ‌దివేయండి!

దాదాపు మూడేళ్ల కింద‌ట కాకినాడ‌-రాజ‌మండ్రి రోడ్డు ప‌నుల‌ను ప్ర‌ముఖ కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ ట్రాయ్ ద‌క్కించుకుంది. ఈ ప‌నుల‌ను ప్రపంచ బ్యాంకు నిధుల‌తో చేప‌డ‌తారు. మొత్తంగా రూ.200 కోట్ల వ్య‌యం అవుతుంది. అయితే, కాంట్రాక్టు ద‌క్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్‌.. కోట్ల రూపాయ‌ల్లో మొబిలైజేష‌న్ అడ్వాన్సులు తీసుకున్నా ప‌నులు మాత్రం ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా ఉన్నాయి. క‌నీసం 10% ప‌నులు కూడా జ‌ర‌గ‌లేదు. దీంతో ప్ర‌పంచ బ్యాంకు ఈ సంస్థ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతోపాటు.. ప‌నుల నుంచి ఈ సంస్థ‌ను త‌ప్పించాల‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి సిఫార్సు చేసింది. ఇదే విష‌యాన్ని అధికారులు సీఎంకు చెప్పారు.

అయితే, ఆయ‌న ఈ సంస్థ‌పై చ‌ర్య‌లు తీసుకోక‌పోగా,  ప్ర‌పంచ బ్యాంకు తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నార‌ని స‌మాచారం. ఈ ప‌రిణామంతో అధికారులు నివ్వెర‌పోయారు.  ఓ వైపు రాష్ట్రం అసలే కష్టాల్లో ఉంటే..ఎప్పుడో ప్రపంచ బ్యాంకు అతి తక్కువ వడ్డీ రేటు కు రోడ్డు ప్రాజెక్టుకు రుణం ఇవ్వటానికి వస్తే…పనులు చేయని ట్రాన్స్ స్ట్రాయ్ పై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఏకంగా…ఈ ప్రాజెక్టు ను వ‌దులుకోవ‌డం ఏమిట‌ని బుగ్గ‌లు నొక్కుకున్నారు.

కానీ, విష‌యంలోకి వెళ్తే.. ఈ ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ.. టీడీపీకి చెందిన ఓ సీనియ‌ర్ ఎంపీద‌ని తేలింది. స‌ద‌రు ఎంపీ 2014 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరి గెలిచారు. ఆయ‌న మ‌న‌సును నొప్పించ‌కూడ‌ద‌ని భావించే చంద్ర‌బాబు ఏకంగా రూ.200 కోట్ల డీల్‌ను సైతం ర‌ద్దు చేసుకున్నార‌ని తెలుస్తోంది. ఎంతైనా టీడీపీ ఎంపీపై ఎందుకు బాబుకి ఇంత ప్రేమ అని చ‌ర్చించుకుంటున్నారు.