జ‌గ‌న్‌కు అస్స‌లు ఛాన్స్ ఇవ్వ‌ని ప‌వ‌న్‌

ఏపీ పాలిటిక్స్ క‌ల‌ర్స్ మారుతున్నాయి! అధికార టీడీపీ, ప్ర‌ధాన విప‌క్షం వైకాపాల మ‌ధ్య పోరు ఇప్పుడు.. జన‌సేన‌కి ల‌బ్ధి చేకూరుస్తోంది! ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది నిజం అంటున్నారు విశ్లేష‌కులు. అధికార ప‌క్షం టీడీపీ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టి ప్ర‌జ‌ల‌కు చేరువ కావడంలో వైకాపా పూర్తిగా వైఫ‌ల్యం అవుతోంద‌నే టాక్ వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో జ‌గ‌న్‌కు రావాల్సిన మైలేజీని జ‌న‌సేనాని ప‌వ‌న్ త‌న ఖాతాలో వేసుకుంటున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో ఏకైక విప‌క్షంగా జ‌గ‌న్ పార్టీ వైకాపా అవ‌త‌రించింది. దీంతో అధికార పార్టీ వైఫ‌ల్యాల‌పై జ‌గ‌న్ పోరు సాగిస్తాడ‌ని, త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని ప్ర‌జ‌లు భావించారు. అయితే, దుర‌దృష్ట‌వ‌శాత్తు జ‌గ‌న్‌కి అన్నీ ఎదురు దెబ్బ‌లే త‌గులుతున్నాయి.

రాజ‌ధాని అమ‌రావ‌తి భూముల విష‌యంలో రైతుల నుంచి పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త ఎదురైంది. కొంద‌రు రైతులు త‌మ భూములు ఇచ్చేందుకు అంగీక‌రించ‌లేదు. దీంతో ప్ర‌భుత్వం భూ సేక‌ర‌ణ ఆయుధాన్ని ప్ర‌యోగిస్తామ‌ని చెప్పింది. ఇది పెద్ద ఎత్తున ఆందోళ‌నకు దారితీసింది. దీనిని త‌న‌కు అనువుగా మ‌లుచుకోవాల్సిన జ‌గ‌న్ కేవ‌లం ఓ స‌భ పెట్టి మ‌మ అనిపించారు. దీంతో రైతులు త‌మ స‌మ‌స్య తీర‌ద‌ని భావించారు. మ‌రోప‌క్క‌, విప‌క్ష వైకాపా విమ‌ర్శ‌ల‌ను ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం మానేసింది. దీంతో రైతులు జ‌న‌సేనాని ప‌వ‌న్‌ని ఆశ్ర‌యించారు. రంగంలోకి దిగిన ప‌వ‌న్ నేరుగా మంగ‌ళ‌గిరి వెళ్లి బాధిత రైతుల‌తో భేటీ అయి చ‌ర్చించారు. అక్క‌డే ప్ర‌భుత్వానికి కొన్ని సూచ‌న‌లు కూడా చేశారు. దీంతో ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింది.

ఇక‌, తాజాగా భీమ‌వ‌రంలోని గోదావ‌రి ఆక్వాపై అక్క‌డి రైతులు ఆగ్ర‌హం, ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్రశ్నిస్తున్న త‌మ‌ను ప్ర‌భుత్వం రాచిరంపాన పెడుతోంద‌ని ఆరోపించారు. ఈ క్ర‌మంలో త‌మ‌కు న్యాయం చేయాల‌ని వాళ్లు విప‌క్ష వైకాపాను ఆశ్ర‌యిస్తార‌ని ఎవ‌రైనా అనుకుంటారు. కానీ, అనూహ్యంగా ఆయా గ్రామాల రైతులు మ‌హిళ‌లు నేరుగా హైద‌రాబాద్ వ‌చ్చి ప‌వ‌న్‌తో భేటీ అయ్యారు. దీనిపై స్పందించిన ప‌వ‌న్‌.. ప‌బ్లిక్ గార్డెన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి బాధితుల ప‌క్షాన ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరారు. అంతే, చంద్ర‌బాబు 24 గంట‌ల్లో స‌మ‌స్య‌పై స్పందించి క‌లెక్ట‌ర్ స‌హా అధికారుల‌తో భేటీ అయి.. ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఈ ప‌రిణామం వైకాపాకు ఊహించ‌ని షాక్‌!

ఇక‌, ఇప్పుడు ప్ర‌త్యేక హోదా అంశంపై వైకాపా అధినేత జ‌గ‌న్‌.. యువ భేరి స‌ద‌స్సులు ప్రారంభించారు. యువ‌త‌ను జాగృతం చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. ఇదేస‌మ‌యంలోప‌వ‌న్ కూడా రంగంలోకి దిగుతున్న‌ట్టు నిన్న ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే అనంత‌పురంలో స‌భ కూడా పెడుతున్న‌ట్టు చెప్పాడు. దీంతో వైకాపా క‌న్నా ప‌వ‌న్ దూకుడే ఎక్కువ‌గా ఉంద‌ని క‌నిపిస్తోంది. సో.. జ‌గ‌న్‌కి ఛాన్స్ ఇవ్వ‌కుండా ప‌వ‌న్ దూసుకుపోతున్నార‌నే అనిపిస్తోంది. అయితే, ప్ర‌జ‌ల్లో ఉన్న ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త జ‌గ‌న్‌కి పాజిటివ్ కాకుండా ఉండేలా ప‌వ‌న్ వెన‌క చంద్ర‌బాబు ఉన్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఏదైతేనేం.. ప్ర‌స్తుతానికి జ‌గ‌న్ మైలేజీని ప‌వ‌న్ కొట్టేస్తున్నాడ‌నడంలో ఎలాంటి సందేహ‌మూ లేదు.