100 సంవ‌త్స‌రాలైనా హైద‌రాబాద్ గతి అంతేనా

తెలంగాణ ప్ర‌భుత్వం పేర్కొంటున్న విశ్వ‌న‌గ‌రం.. దృశ్యం.. చిన్న చినుకు ప‌డితే అప‌హాస్యం పాల‌వుతోంది. నిన్న మొన్న కురిసిన కుంభ వృష్టితో హైద‌రాబాద్ రూపు రేఖ‌లే మారిపోయాయి. ఎక్క‌డ చూసినా నీటి ప్ర‌వాహాలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇక‌, లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ నిండిపోయాయి. ఇళ్ల‌లోకి నీరు చేరింది. కొన్ని చోట్ల అపార్ట్‌మెంట్ల‌లోకి కూడా నీరు చేరింది. దీంతో అన్ని వ‌ర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయితే, అధికార టీఆర్ ఎస్ మాత్రం ఈ పాపం మాది కాద‌ని, గ‌త పాల‌కుల‌ద‌ని విమ‌ర్శిస్తూ.. కాలం వెళ్ల‌దీస్తోంది. వాస్త‌వానికి ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఉన్న డ్రైనేజీ వ్య‌వ‌స్థ ఇప్ప‌టిది కాదు! దాదాపు 1905లో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఇంజ‌నీర్ మోక్ష‌గుండం విశ్వేశ్వ‌ర‌య్య ఆధ్వ‌ర్యంలో అప్ప‌టి నిజాం ప్ర‌భుత్వం ఈ డ్రైనేజీకి రూప‌క‌ల్ప‌న చేసింది.

ఆ ప్లానే ఇప్ప‌టికీ అమ‌ల‌వుతోంది. నగరంలో ఎంత భారీ వర్షం కురిసినా సత్వరం వరదనీరు డ్రయినేజీల్లోకి వెళ్లేలా, ఆ తర్వాత అటు హుసేన్ సాగర్ లో ఇటుమూసీలోకి ప్రవహించేలా విశ్వేశ్వరయ్య డిజైన్ చేశారు. దీంతో అప్ప‌ట్లో ఎంత భారీ వ‌ర్షం కురిసినా.. చుక్క‌నీరు కూడా క‌నిపించేదికాదు. కానీ.. హైద‌రాబాద్ రాజ‌ధాని కావ‌డంతో జ‌న‌సాంద్ర‌త ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరిగిపోయింది.వ్యాపార‌, వాణిజ్య స‌ముదాయాలు పెరిగిపోయాయి. దీంతో జ‌నావాసాలు కూడా పెరిగిపోయాయి. ఫ‌లితంగా చెరువులు, కుంట‌లు మూత‌బ‌డ్డాయి. వాటిపై నిర్మాణాలు వెలిసాయి. ఫ‌లితంగా నీటి వ్య‌వ‌స్థ‌, డ్రైనేజీ నిర్మాణం పూర్తిగా దెబ్బ‌తిన్నాయి. నాలాలు, చెరువులపై భవనాలు వెలిశాయి. హుసేన్ సాగర్ ఎదురుగా నిర్మాణాలు వెలిశాయి.

దీంతో హైద‌రాబాద్ డ్రైనేజీ వ్య‌వ‌స్థ పూర్తిగా దెబ్బ‌తింది. ఫ‌లితంగా చిన్న చినుకునే భాగ్య‌న‌గ‌రం అభాగ్య న‌గ‌రం అవుతోంది. చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేయడం దీనికి ప్రధాన కారణం. వరద నీరు పోవడానికి దారే లేకుండా పోయింది. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో విశ్వ‌న‌గ‌రం దుర‌వ‌స్థ న‌గ‌రంగా మారుతోంది. మ‌రి పాల‌కులు గ‌త పాల‌న‌నే విమ‌ర్శిస్తూ.. కూర్చుంటారా? లేక యుద్ధ‌ప్రాతిప‌దిక‌న డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌కు న‌డుం బిగిస్తారా చూడాలి. మొన్నామ‌ధ్య ఓ చానెల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన తెలంగాణ మునిసిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్‌.. హైద‌రాబాద్ డ్రైనేజీ వ్య‌వ‌స్థ బాగుప‌డేందుకు క‌నీసం రూ.11 వేల కోట్లు కావాల‌ని అంచ‌నా వేశామ‌న్నారు. అందుకే దీనిని చేప‌ట్ట‌డం క‌ష్టంగా మారింద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. మ‌రి తెలంగాణ ప్ర‌భుత్వం ఇలానే లెక్క‌లు క‌డుతూ కూర్చుంటే విశ్వ‌న‌గ‌రం భ‌విష్య‌త్తు.. నిజంగానే డ్రైనేజీ పాల‌య్యే ప్ర‌మాదం ఉంటుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.