యాక్షన్‌లోకి దిగుతున్న ఉండవల్లి

రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ లీగల్‌ విషయాల్లోకి దిగితే ప్రత్యర్థి ఎలాంటివారైనా సరే చిక్కుల్లో పడాల్సిందే. మీడియా మొఘల్‌ రామోజీరావుకే చెమటలు పట్టించారాయన. ఈసారి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఓటుకు నోటు కేసులో ఇంప్లీడ్‌ అవబోతున్నారు. స్వతహాగా ఉండవల్లి న్యాయవాది. మంచి మాటకారి కూడా. ఆయన లాజిక్‌ లేకపోయినా, లాజిక్‌ ఉన్నట్లు మాట్లాడగలరు.

ఓటుకు నోటు కేసు చాలా తీవ్రమైంది. రాజకీయ ఉద్దేశ్యాలతోనే ఓటుకు నోటు అంశం తెరపైకి వచ్చినప్పటికీ, అందులో తెలుగుదేశం పార్టీ ఇరుక్కుపోయింది. కేంద్రాన్ని బతిమాలుకుని, కెసియార్‌తో రాజీ కుదుర్చుకుని కేసులోంచి చంద్రబాబు కొంతవరకు తప్పించుకున్నారు. తప్పించుకున్న చంద్రబాబుని తిరిగి ఈ కేసులో ఇరికించడానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే వైఎస్‌ జగన్‌, ఉండవల్లి అరుణ్‌కుమార్‌ని రంగంలోకి దించనున్నట్లు సమాచారమ్‌.

అయితే ఇలాంటి కేసుల కన్నా, అసలు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభలో పాస్‌ అవలేదని మీడియా ముందు వాదిస్తున్న ఉండవల్లి, సుప్రీంకోర్టును ఆశ్రయించి, ఆ సంగతేంటో చూస్తే మంచిది. చట్ట సభల సాక్షిగా ప్రధాన మంత్రి హోదాలో మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీకి విలువ ఉందో లేదో న్యాయస్థానాల్లో వాదించి, నిజాలు నిగ్గుతేల్చాలి. ఏదేమైనా ఉండవల్లి రంగంలోకి దిగితే చంద్రబాబుకి ఓటుకు నోటు కేసులో కష్టాలు తప్పవు.