మంత్రి వర్గ విస్తరణ – చినబాబు ఒక్కడేనా?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మంత్రి వర్గాన్ని విస్తరించే ఆలోచనల్లో ఉన్నారని కొన్ని నెలలుగా ఊహాగానాలు వినవస్తున్నాయి. అయితే మంత్రి వర్గ విస్తరణ చేపట్టడం అంటే తేనెతుట్టెను కదిలించినట్లే అవుతుందని చంద్రబాబుకి బాగా తెలుసు. అందుకనే విస్తరణ కాకుండా ఒక్కర్ని ప్రస్తుతానికి కొత్తగా మంత్రివర్గంలో తీసుకుని, విస్తరణను వాయిదా వేయాలని చూస్తున్నారట. ఆ ఒక్కరూ ఎవరో కాదట, చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ అట. చినబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందిగా డిమాండ్లు వినవస్తున్న వేళ, తన కుమారుడ్ని మంత్రిగా చూసుకోవాలన్న తన కోరికను తీర్చుకోవడం చంద్రబాబుకి వివాదాలతో పనిలేని విషయమే.

 అతి త్వరలో లోకేష్‌ని మంత్రి వర్గంలోకి తీసుకుని, ఆ తర్వాత నెల రోజులకు విస్తరణ చేపట్టనున్నారని తెలియవస్తోంది. కొత్తగా చంద్రబాబు తన మంత్రి వర్గంలోకి ఆరుగుర్ని తీసుకోడానికి ఛాన్స్‌ ఉంది. దాంతో ఎవరికీ ఇబ్బందులుండవని చంద్రబాబు భావిస్తున్నారట. ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారిలో ఇద్దరు లేదా ముగ్గుర్ని తొలగించే అవకాశం ఉందని సమాచారమ్‌. ముగ్గురిని తొలగిస్తే, మొత్తం తొమ్మిదిమందిని కొత్తగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సామాజిక వర్గ సమీకరణాలు, ప్రాంతాల వారీ లెక్కలు, జిల్లాల వారీ అంచనాలు వంటివన్నీ లెక్కల్లోకి తీసుకుంటున్నారట చంద్రబాబు.