పాక్‌ ముష్కర మూకల ఆటకట్టు

కుక్క కాటుకి చెప్పుదెబ్బ అనే స్థాయిలో సైన్యం పాకిస్తానీ తీవ్రవాదులపై విరుచుకుపడింది. జమ్మూకాశ్మీర్‌లోని యురి సెక్టార్‌లో సైనిక శిబిరంపై దాడులు చేసి 18 మంది సైనికుల్ని తీవ్రవాదులు పొట్టనపెట్టుకోగా, భారత సైన్యం ప్రతీకారేచ్ఛతో రగిలిపోయింది. ఇంతలోనే పాకిస్తాన్‌ నుంచి యురి సెక్టార్‌ టార్గెట్‌గా పాక్‌ సైన్యం కాల్పులను ప్రారంభించింది. దాంతో భారత సైన్యం అప్రమత్తమయ్యింది. తీవ్రవాదుల్ని బోర్డర్‌ దాటించేందుకు పాకిస్తాన్‌ సైన్యం వ్యూహాత్మకంగా ఈ కాల్పులను జరుపుతుంటుంది. ఇది గ్రహించిన సైన్యం, రంగంలోకి దిగి, బోర్డర్‌ దాటుతున్న తీవ్రవాదులపై కాల్పులు జరిపింది. తీవ్రవాదులూ ప్రతిఘటించారు.

ఈ హోరాహోరీ పోరులో 10 మంది తీవ్రవాదుల్ని సైన్యం హతమార్చగలిగింది. మరో ఐదుగురు తీవ్రవాదులు తిరిగి పాకిస్తాన్‌ వైపుకు వెళ్ళిపోయినట్లుగా భారత సైన్యం భావిస్తోంది. ఇంకో వైపున ప్రపంచ వేదికలపై పాకిస్తాన్‌ కుట్రల్ని, కుయుక్తుల్ని ఎండగట్టేందుకు భారత ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ముందుగా పాకిస్తాన్‌ని అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేసి, ఆ తరువాత పాకిస్తాన్‌పై సైనిక చర్య చేపట్టాలనే ఆలోచనలో ఉంది భారత సైన్యం. ఇంకో వైపున పాకిస్తాన్‌ నుంచి ఎలాంటి కాల్పులు మొదలైనా, ఘాటుగా సమాధానం ఇవ్వవలసిందిగా సైన్యానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆదేశాలు జారీ చేసినట్లు తెలియవస్తోంది.